రైల్వే స్టేషన్లలో ఉచితంగా వైఫై వాడుకోవచ్చు.. రైల్ టెల్ ప్రకటన

శనివారం, 6 మార్చి 2021 (22:25 IST)
Free Wi Fi
రైల్వే స్టేషన్లలో ఎవరైనా ఉచితంగా వైఫై ఉపయోగించుకోవచ్చు. మొదట 30 నిమిషాలు ఉచితంగా వైఫై వాడుకోవచ్చు. ఆ తర్వాత డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం వేర్వేరు ప్లాన్స్ ప్రకటించింది రైల్‌టెల్. స్మార్ట్‌ఫోన్‌లో ఓటీపీ బేస్డ్ వెరిఫికేషన్ ద్వారా వైఫై అందిస్తోంది రైల్‌టెల్. మొదటి 30 నిమిషాలు ఉచితం. ఆ తర్వాత డబ్బులు చెల్లించాలి.
 
ఇలా దేశంలోని 4,000 రైల్వే స్టేషన్లలో హైస్పీడ్ ప్రీపెయిడ్ ఇంటర్నెట్ అందిస్తున్నట్టు భారతీయ రైల్వేకు చెందిన రైల్‌టెల్ సంస్థ ప్రకటించింది. మొదట ఉత్తర్‌ప్రదేశ్‌లోని 20 రైల్వే స్టేషన్లలో ప్రయోగాత్మకంగా పెయిడ్ వైఫైని లాంఛ్ చేసింది. అక్కడ ఈ ప్రయోగం విజయవంతం కావడంతో దేశవ్యాప్తంగా ప్రీపెయిడ్ వైఫై సర్వీస్ ప్రారంభించింది. దేశంలోని మొత్తం 5,950 రైల్వే స్టేషన్లలో వైఫై సదుపాయం ఉంది.  ఇందులో ప్రీపెయిడ్ వైఫై సదుపాయం 4000 స్టేషన్లలో లభిస్తుంది. వేర్వేరు స్టేషన్లలో స్పీడ్ వేర్వేరుగా ఉంటుంది. 1 ఎంబీపీఎస్ నుంచి 34 ఎంబీపీఎస్ వరకు స్పీడ్ లభిస్తుంది. 
 
రైల్‌టెల్ ప్లాన్స్ చూస్తే ఒక రోజులో 5జీబీ డేటా వాడుకోవడానికి రూ.10 చెల్లించాలి. ఒక రోజు 10జీబీ డేటాకు రూ.15, ఐదు రోజులకు 10జీబీ డేటాకు రూ.20, ఐదు రోజులు 20జీబీ డేటాకు రూ.30 చెల్లించాలి. ఇక 10 రోజులకు 20జీబీ డేటా కోసం రూ.40 చెల్లించాలి. 10 రోజులకు 30 జీబీ డేటా కోసం రూ.50 చెల్లించాలి. 30 రోజులకు 60 జీబీ డేటా కోసం రూ.70 చెల్లించాలి. ప్రయాణికులు తమ అవసరాలకు తగ్గట్టుగా ఈ ప్లాన్స్ ఎంచుకోవచ్చు. 
 
నెట్ బ్యాంకింగ్, ఇ-వ్యాలెట్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేయొచ్చు. రైల్‌టెల్ లెక్కల ప్రకారం ప్రతీ నెల 3 కోట్ల మంది యూజర్లు రైల్వేస్టేషన్లలో వైఫై ఉపయోగిస్తున్నారు. పెయిడ్ వైఫై సర్వీస్ ద్వారా రైల్‌టెల్‌కు రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్ల మధ్య ఆదాయం లభిస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు