గిగా ఫైబర్ సేవలను అందించనున్న జియో.. ఆగస్టు 12 నుంచి ప్రారంభం.?

గురువారం, 1 ఆగస్టు 2019 (19:24 IST)
ఉచిత డేటాతో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జియో ప్రస్తుతం గిగా ఫైబర్ సేవల్లో తలమునకలైంది. జియో గిగా ఫైబర్‌ పేరుతో రిలయన్స్‌ నుంచి బ్రాడ్‌ బ్యాండ్‌, టీవీ సేవలు అందుబాటులోకి వచ్చినా.. ఇంకా ఇవి ట్రయల్ దశలోనే వున్నాయి. ఇంకా పూర్తి స్థాయిలో గిగా ఫైబర్ సేవలు ప్రారంభం కాలేదు. అయితే తాజాగా ఈ సేవలు ఆగస్టు 12వ తేదీన వాణిజ్యపరంగా మొదలయ్యే అవకాశం వుందని తెలుస్తోంది. 
 
జియో గిగా ఫైబర్ ద్వారా పరిమితి లేని వాయిస్ కాల్స్, 100 ఎంబీపీఎస్‌ వేగంతో ఇంటర్నెట్‌, జియో హోం టీవీ, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ), కొన్ని జియో యాప్స్‌కు ఉచిత చందా వంటి సౌకర్యాలున్నాయి.
 
28 రోజుల వ్యాలిడిటీతో ప్లాన్‌ను ప్రవేశపెట్టనుండగా.. నెలవారీ ఛార్జీ రూ.500 నుంచి రూ.1000 మధ్య ఉండే అవకాశముంది. అధికారికంగా టారీఫ్‌ ఛార్జీల వివరాలను సంస్థ ప్రకటించాల్సి వుంది. అలాగే ప్రస్తుతం ట్రయల్‌ సేవలు అందుబాటులో ఉన్న నగరాల్లో సెక్యురిటీ డిపాజిట్‌ రూ.2,500 నుంచి రూ.4,500 వసూలు చేసి గిగా ఫైబర్‌ కనెక్షన్‌ ఇస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు