భారత్‌లో మోస్ట్ ఇన్నోవేటివ్ కంపెనీ రిలయన్స్ జియో

బుధవారం, 21 ఫిబ్రవరి 2018 (15:19 IST)
ప్రపంచంలో మోస్ట్ ఇన్నోవేటివ్ కంపెనీ(ఎంఐసీ)-2018 జాబితాను ఫాస్ట్ కంపెనీ బుధవారం విడుదల చేసింది. ఇందులో భారత్‌ నుంచి టెలికాం సంచలనం రిలయన్స్ జియో ప్రపంచంలో 17వ ర్యాంకును సొంతం చేసుకోగా, దేశీయంగా(భారత్‌) తొలి స్థానాన్ని దక్కించుకుంది. 
 
రిలయన్స్ జియో అందుబాటులోకి తెచ్చిన టెక్నాలజీ, సరికొత్త ఆవిష్కరణల కారణంగా భారత దేశంలో డిజిటల్ సేవల్లో విప్లవాత్మక మార్పులు తీసుకుని రావడమేకాకుండా, డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో భారత్‌ను అంతర్జాతీయ వేదికపైకి పరిచయం చేసింది. ముఖ్యంగా, భారతీయ టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులకు రిలయన్స్ జియో శ్రీకారం చుట్టింది. ఫలితంగా, ప్రపంచంలో అతి చౌక ధరలకే ఇంటర్నెట్ డేటాతో పాటు మొబైల్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. 
 
దీనిపై రిలయన్స్ జియో డైరెక్టర్ ఆకాష్ అంబానీ స్పందిస్తూ, దేశంలోని ప్రతి పౌరుడికీ చౌక ధరలకే బ్రాడ్‌బాండ్ టెక్నాలజీని తీసుకుని రావడమే ముఖ్యోద్దేశ్యమనే విషయాన్ని తమ సేవల ప్రారంభోత్సవంలో తమ విధానాన్ని స్పష్టం చేసినట్టు గుర్తుచేశారు. తమ మొబైల్ వినియోగదారులకు అత్యుత్తమ సేవలు అందించేందుకు కట్టుబడి ఉన్నామనీ, అయితే, తమ మాటను నిలబెట్టుకోవాలంటే సరికొత్త ఆవిష్కరణలతోనే ఇది సాధ్యపడుతుందన్నారు. కాగా, జియో కంపెనీ అంతర్జాతీయంగా అగ్రగామిగా ఉన్న యాపిల్, నెట్‌ఫ్లిక్స్, టెన్సెంట్, అమేజాన్, స్పాటిఫై వంటి అనేక సంస్థల సరసన చేరింది. 
 
మోస్ట్ ఇన్నోవేటివ్ కంపెనీల జాబితాను తయారుచేసేందుకు ఫాస్ట్ కంపెనీకి చెందిన మూడు డజన్ల మంది ఎడిటర్లు, రిపోర్టర్లు, కంట్రిబ్యూటర్లు వేల సంఖ్యలో కంపెనీల్లో సర్వే నిర్వహించి తమ నివేదికను అందజేయడం జరిగింది. 36 కేటగిరీల్లో పయనీర్లుగా ఉన్న కంపెనీల నుంచి 10 జాబితాలను తయారు చేశారు. ఈ జాబితా నుంచి 50 మోస్ట్ ఇన్నోవేటివ్ కంపెనీలను ఎంపిక చేయడం జరిగింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు