ఫ్రెషర్స్‌కు టీసీఎస్ గుడ్‌న్యూస్.. 40వేల మందికి క్యాంపస్ ద్వారా ఉద్యోగాలు
శనివారం, 10 జులై 2021 (11:00 IST)
ఐటీ దిగ్గజం, కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) తాజాగా ఫ్రెషర్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2021-22) వివిధ క్యాంపస్‌ల నుంచి 40 వేల నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం టీసీఎస్‌లో 5 లక్షల మంది పనిచేస్తున్నారు.
గతేడాది వివిధ క్యాంపస్‌ల నుంచి 40 వేలమందిని ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. మొత్తం 3.60 లక్షల మంది ఫ్రెషర్స్ వర్చువల్‌గా ఎంట్రన్స్ టెస్ట్‌కు హాజరయ్యారని టీసీఎస్ గ్లోబల్ హెచ్‌ఆర్ చీఫ్ మిలింద్ లక్కడ్ తెలిపారు.
ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి ఆశాజనక ఫలితాలను ప్రకటించిన మరుసటి రోజే టీసీఎస్ ఈ శుభవార్త చెప్పింది. ఉద్యోగులను చేర్చుకునే క్రమంలో కొవిడ్ నిబంధనలు అడ్డంకిగా మారలేదని తెలిపారు. దేశంలో ప్రతిభకు కొదవ లేదని కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎన్ గణపతి సుబ్రమణియమ్ తెలిపారు.
ఖర్చు గురించి ఆందోళన లేదన్నారు. ఈ ఏడాది కూడా 40వేల మంది ఫ్రెషర్లను తీసుకోనున్నట్లు లక్కడ్ చెప్పారు. వ్యాపార ఒప్పందాలు పుంజుకోగానే నియామకాలు ప్రక్రియ ప్రారంభిస్తామని వివరించారు.