టీసీఎస్‌‌ అదుర్స్.. 6 నెలల్లోపు మళ్లీ ఉద్యోగులకు వేతనాలు పెంపు.. ఏప్రిల్ 1 నుంచి..?

శనివారం, 20 మార్చి 2021 (10:38 IST)
TCS
దేశీయ ఐటీ దిగ్గ జం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్‌‌) తమ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఏప్రిల్‌ 1 నుంచి అన్ని విభాగాల్లోని ఉద్యోగుల వేతనాలను పెంచనున్నట్లు ఆ కంపెనీ ప్రకటించింది. దీంతో 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగుల వేతనాలను పెంచబోతున్నట్లు ప్రకటించిన తొలి ఐటీ సంస్థగా టీసీఎస్‌ నిలిచింది. ఈ ప్రకటనతో టీసీఎస్‌లోని దాదాపు 4.7 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. 
 
తాజా నిర్ణయంతో దేశంలోని టీసీఎస్‌ ఉద్యోగుల వేతనాలు సగటున 12 నుంచి 14 శాతం వరకు పెరిగే అవకాశముంద, విదేశాల్లో పనిచేస్తున్న (ఆఫ్‌షోర్‌) ఉద్యోగులకు ఈ పెంపు 6 నుంచి 7 శాతం మేరకు ఉండవచ్చని సమాచారం. టీసీఎస్‌ ఉద్యోగుల వేతనాలు పెరగనుండటం ఆరు నెలల్లో ఇది రెండోసారి. ఇంతకుముందు ఆ సంస్థ గతేడాది అక్టోబర్‌లో ఉద్యోగుల వేతనాలను పెంచింది. 
 
కాగా, టీసీఎస్‌ తాజా నిర్ణయాన్ని ఆ సంస్థ అధికార ప్రతినిధి కూడా ధ్రువీకరించారు. నిబంధనలకు లోబడి ఏప్రిల్‌ 1 నుంచి అన్ని ప్రాంతాల్లోని ఉద్యోగుల వేతనాలను పెంచేందుకు కంపెనీ కసరత్తు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. కరోనా కష్ట కాలంలో కంపెనీని వినూత్న ఆలోచనలతో ముందుకు నడిపిన టీసీఎస్‌ ఉద్యోగులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఉద్యోగుల పట్ల కంపెనీకి గల నిబద్ధతకు వేతనాల పెంపు నిర్ణయమే నిదర్శనమని చెప్పారు. 
 
కొవిడ్‌-19 సంక్షోభ సమయంలో టీసీఎస్‌ క్లౌడ్‌ సేవలకు డిమాండ్‌ పెరగడం కంపెనీకి ఎంతో కలిసొచ్చింది. దీంతో 2020 డిసెంబర్‌ 31తో ముగిసిన త్రైమాసికంలో టీసీఎస్‌ నికర లాభం 7.2 శాతం పెరిగి రూ.8,701 కోట్లకు వృద్ధి చెందింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు