ఖర్చు తగ్గుతోందిగా.. వర్క్ ఫ్రమ్ హోమ్‌నే కంటిన్యూ చేస్తే పోలా?

గురువారం, 14 మే 2020 (17:46 IST)
ప్రపంచ దేశాలకు చుక్కలు చూపిస్తున్న కరోనాతో ఏర్పడిన లాక్ డౌన్ కారణంగా ఐటీ సంస్థలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయాన్ని కల్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా ఉద్యోగులకు అయ్యే ఖర్చులు చాలామటుకు తగ్గాయి. ఇదే అదనుగా పలు ఐటీ సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్‌ను నిరంతరంగా కొనసాగించే అంశంపై యోచిస్తున్నట్లు తెలుస్తోంది. 
 
కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో వున్న తరుణంలో తమతమ ఉద్యోగులను ఇంటి వుంటే పనిచేయిస్తున్నాయి ఐటీ కంపెనీలు. ఈ సదుపాయం ద్వారా ఐటీ ఉద్యోగుల పనితీరు మెరుగుపడిందని పరిశోధనలో తేలింది. ఫలితంగా వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని కార్మిక చట్టంలో భాగం చేయాలని ఐటీ సంస్థలు డిమాండ్ చేశాయి. ఈ డిమాండ్ మేరకు నాస్కామ్ అనే సంస్థ వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని కార్మిక చట్టంలో భాగం చేసే దిశగా ఓ నివేదికను సిద్ధం చేసింది. 
 
ఈ నివేదికలోని అంశాలు అమలులోకి వస్తే.. టీసీఎస్ సంస్థ 2025 వరకు తమ ఉద్యోగులు 75శాతం మందికి వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో పనిచేసేందుకు అనుమతివ్వాలనుకుంటోంది. టెక్ మహీంద్రా సంస్థ కూడా 25శాతం ఉద్యోగులకు రొటేషన్ విధానంలో వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా పనిచేసేందుకు వీలు కల్పించనుంది. 
 
తద్వారా వేలాది మంది పనిచేసే ఐటీ సంస్థల్లో వందలాది మంది మాత్రమే ఆఫీసులకు వెళ్తారు. దీంతో ఉద్యోగుల కోసం ఐటీ కంపెనీలు వెచ్చించే ఖర్చులు కూడా తగ్గుతాయి. ఫలితంగా ఈ విధానంపై ఐటీ కంపెనీలు తీవ్రస్థాయిలో కసరత్తులు జరుపుతున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు