కళ తప్పుతున్న "సాఫ్ట్‌వేర్" రంగం

PNR

శనివారం, 10 జనవరి 2009 (16:42 IST)
నిన్మ మొన్నటి వరకు హైటెక్ ప్రపంచాన్ని శాసించిన సాఫ్ట్‌వేర్ రంగం ప్రస్తుతం కళ తప్పుతున్నట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా దేశంలో ఐటీ రా'రాజు'గా వెలుగొందిన సత్యం కంప్యూటర్స్ సంస్థలో జరిగిన కుంభకోణం దేశ ఐటీ రంగాన్ని దిగ్భ్రమకు లోనుచేసింది. దీంతో రాష్ట్రం ఐటీ రంగంలో తన ప్రాభవాన్ని కోల్పోయే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

దీనికి తోడు.. ఒకవైపు ప్రపంచ ఆర్థిక మాంద్యం. మరోవైపు.. శ్వేతసౌథం బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఔట్‌‍సోర్సింగ్ సేవలకు అడ్డుకట్ట వేస్తామని అమెరికా కొత్త అధ్యక్షుడు బరాక్ ఒబామా చేసిన హెచ్చరిక కూడా మరో కారణం. దీంతో ఐటీ ఉద్యోగం అంటే.. పలువురు యువకులు వెనుకంజ వేస్తున్నారు.

గతంలో రియల్ ఎస్టేట్ రంగాన్ని శాసించిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. ప్రస్తుతం నెల జీతం కోసం రోజుల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. అంతర్జాతీయ విఫణిలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఐటీ రంగంలో భారీ క్షీణత కనిపించింది. అంతేకాకుండా ఐటీ ఉద్యోగికి పిలిచి తమ అమ్మాయిని ఇచ్చే ఆడపిల్లల తల్లిదండ్రులు ప్రస్తుతం ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు.

అలాగే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు క్రెడిట్ కార్డులు, గృహ, వ్యక్తిగత, విద్యా తదితర రుణాలు ఇచ్చేందుకు గతంలో బ్యాంకులు పోటీ పడ్డాయి. ప్రస్తుతం ఐటీ ఉద్యోగి ముఖం చూసేందుకు సైతం బ్యాంకులు చూసేందుకు ఆసక్తి చూపించడం లేదు. ఇలాంటి తరుణంలో సత్యం కంప్యూటర్స్ సంక్షోభం ఐటీ ఉద్యోగుల భవితవ్యాన్ని మరింత అగాధంలోకి నెట్టింది.

రాష్ట్రంలో మకుటం లేని మహా'రాజు'గా వెలుగొందిన సత్యం.. దేశంలోని ఐటీ కంపెనీలలో నాలుగో స్థానంలో వుంది. మొత్తం 52 దేశాల్లోని కస్టమర్లకు సేవలు అందిస్తూ.. మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. ఇలాంటి తరుణంలో సత్యం రాజు చేసిన అంకెల గారడీ పరిస్థితిని మరింత దిగజార్చింది. దీంతో సంస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.

వెబ్దునియా పై చదవండి