దేశీయ జీఎస్ఎం నెట్‌వర్క్ లోపాలను ఎత్తిచూపిన హ్యాకర్లు
సోమవారం, 20 ఫిబ్రవరి 2012 (15:59 IST)
ప్రస్తుతం దేశంలో ఉన్న జిఎస్ఎం మొబైల్ వ్యవస్థలో డొల్లతనం మరోమారు బట్టబయలయింది. హైదరాబాదులోని ఏ ఉగ్రవాదో, లేదా మరో అపరితుడో, విజయవాడలోని మీ జేబులో నిక్షేపంగా ఉన్న మీ ఫోనును ఉపయోగించి మీకు తెలియకుండా కాల్స్ చేసేసుకోవచ్చు.. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవచ్చు. ఆ తర్వాత జరిగే విపరిణామాలకు మాత్రం బాధ్యత మాత్రం మీదే. ప్రస్తుతం ఉన్న జీఎస్ఎం ఆధారిత వ్యవస్థ ఇందుకు ఆస్కారం కల్పిస్తోంది. దీన్ని కొందరు సైబర్ నిపుణులు ప్రయోగాత్మకంగా నిరూపించారు.
ప్రస్తుత జీఎస్ఎం మొబైల్ నెట్‌వర్కుల్లోని డొల్లతనాన్ని వేలెత్తిచూపారు. సైబర్ భద్రతపై ఇటీవల జరిగిన ఓ సదస్సులో మ్యాట్రిక్స్ షెల్ అనే ఎథికల్ హ్యాకర్ల బృందం సెల్ వినియోగదారులను ఎలా మోసం చేయవచ్చో చేసి చూపింది. దేశీయంగానే కాదు.. అంతర్జాతీయంగా కూడా అనేక టెలికామ్ నెట్‌వర్కుల్లో సరైన ప్రమాణాలు లేవని ఈ హ్యాకర్ల బృందం వెల్లడించింది.
నిజానికి, మన ఫోను నుండి మనం చేసుకునే కాల్స్‌ను నిబంధనల ప్రకారం ఆయా టెలికాం ఆపరేటర్లు రహస్య సంకేతాలుగా (ఎన్‌క్రిప్ట్) మార్చాల్సి ఉంటుంది. అయితే, అలా జరగడం లేదు. దీనికితోడు వినియోగదారుల గుర్తింపులో కూడా లోపాలున్నాయని తేల్చారు.
వినియోగదారులెవరయిన ఫోన్ కాల్ లేదా సందేశాన్ని(ఎస్ఎంఎస్)ను చేసిన ప్రతీసారి వాటికి తాత్కాలిక గుర్తింపు(టీఎంఎస్ఐ) సంఖ్యను ఉపయోగించాల్సి ఉంటుంది. అయితే చాలామంది ఆపరేటర్లు అలా చేయకుండా, ఎప్పుడూ ఒకే టీఎంఎస్ఐ సంఖ్యను వాడుతున్నా రు. హ్యాకర్లకు ఈ సంఖ్య తెలిస్తే చాలు. వినియోగదారుకు తెలియకుండానే వారి నంబర్ నుంచి కాల్ చేసుకోవచ్చు. వారికి వచ్చే కాల్స్‌ను కూడా వినవచ్చు అని మ్యాట్రిక్స్ షెల్ నిపుణులు వివరిస్తున్నారు.