దేశ భద్రతకు ముప్పుగా మారిన చైనా మొబైల్స్

FileFILE
ఎలక్ట్రానిక్స్ వస్తు ఉత్పత్తిలో పొరుగు దేశం చైనా ప్రపంచంలోనే అగ్రగామిగా పేరుగాంచింది. ముఖ్యంగా మొబైల్ రంగం అత్యంత వేగంగా అభివృద్ధి చెందేందుకు చైనా మార్కెట్ ప్రధాన కారకంగా దోహదపడింది. అదేసమయంలో పలు దేశాల భద్రతకు చైనా మొబైల్స్ తీవ్రముప్పుగా పరిణమిస్తోంది. ఇటీవల దేశ వాణిజ్య రాజధాని ముంబైపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో భాగంగా సమాచారాన్ని చేరవేసేందుకు చైనా మొబైల్స్ వినియోగించినట్టు భారత నిఘా వర్గాలు నిర్వహించిన దర్యాప్తులో వెల్లడైన పచ్చినిజం.

ఒకే ఇంటర్నేషనల్‌ మొబైల్‌ ఎక్విప్‌మెంట్‌ ఐడెంటిటీ (ఐఎంఇఐ) నెంబర్‌తో వందలాది సెల్‌ఫోన్స్‌ను చైనా తయారు చేసి భారత మార్కెట్‌కు తరలిస్తోంది. అధునాతన టెక్నాలజీతో పాటు అనేక ఫ్యూచర్లు, డబుల్ సిమ్ వంటి సౌకర్యాలు ఉండటంతో మొబైల్ వినియోగదారులు కూడా ఈ ఫోన్స్ పట్ల అత్యంత ఆసక్తి చూపుతున్నారు.

సాధారణంగా ప్రతి మొబైల్‌ ఫోన్‌కు 15 అకెంలతో కూడిన ఇంటర్నేషనల్‌ మొబైల్‌ ఎక్విప్‌మెంట్‌ ఐడెంటిటీ (ఐఎంఇఐ) నెంబర్‌ ఉంటుంది. వినియోగదారుడు ఫోన్‌ ఉపయోగించిన ప్రతిసారి ఈ నెంబర్‌ ఆయా ఆపరేటర్ల నెట్‌వర్క్‌లో డిస్‌ప్లే అవుతుంది. దీని ద్వారా మొబైల్‌ ఫోన్‌ చోరీకి గురైనా లేదా దొడ్డిదారిన దేశంలోకి తరలివచ్చినా గుర్తించే వెసులుబాటు ఉంటుంది.

ఇలాంటి ఫోన్లను నిరోధించేందుకు ఐఎంఇఐ నంబరు ఎంతో ఉపయోగకారిగా ఉంటుంది. అయితే.. చైనా తదితర విదేశాల నుంచి ఐఎంఇఐ నంబర్‌ లేని మొబైల్‌ ఫోన్లు భారీ ఎత్తున దేశంలోని వివిధ ప్రాంతాలకు దిగుమతి అవుతున్నాయి. దొంగమార్కెట్లో ఈ మొబైల్‌ ఫోన్లకు ధర తక్కువగా ఉండటం వల్ల వీటిని కొనుగోలు చేసేవారి సంఖ్య పెరిగింది.

ఇలా దిగుమతి చేసుకునే మొబైల్ ఫోన్లకు వాస్తవమైన ఐఎంఇఐ నంబర్‌ ఉండదని ఇండియన్‌ సెల్యులార్‌ అసోసియేషన్‌ (ఐసిఎ) అంటోంది. ఇక దొంగిలించిన మొబైల్‌ ఫోన్లు సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదని, పోయిన మొబైల్‌ ఫోన్లు పనిచేయకుండా ఉండేలా చేసే నియంత్రణ వ్యవస్థ లేదని ఐసిఎ అంటోంది. అందువల్ల సాంకేతిక కారణాల వల్ల డాట్‌ నిర్ధేశించిన కాలంలో ఫోన్లు పనిచేయకుండా చేసే అవకాశం కూడా తక్కువగా ఉందని కొంత మంది ఆపరేటర్లంటున్నారు.

బ్రాండెడ్‌ కంపెనీలు తయారు చేసిన ప్రతీ మొబైల్‌ ఫోన్‌కు ఖచ్చితంగా 15 నుంచి 17 అంకెలుగల ఇంటర్నేషనల్‌ మొబైల్‌ ఎక్విప్‌మెంట్‌ ఐడెంటిటీ నెంబర్‌ (ఐఎంఇఐ) ఉంటుంది. కొత్త హ్యాండ్‌సెట్‌ను కొని సిమ్‌కార్డును వేసిన వెంటనే సదరు హ్యాండ్‌సెట్‌ ఐఎంఇఐ నెంబరు జిఎస్‌ఎం సర్వీస్‌ ప్రొవైడర్‌ వద్ద నమోదైపోతుంది.

ఉగ్రవాదులు... అసాంఘిక శక్తులు సెల్‌ఫోన్లను ఉపయోగించి విచ్ఛిన్నకర కార్యకలాపాలకు పాల్పడి పట్టుబడినపుడు పోలీసువర్గాలు మొదటగా చేసే పని వారి నుంచి సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని, ఆ ఫోన్‌ నుంచి ఎక్కడెక్కడికి ఫోన్ కాల్స్‌ వెళ్ళాయనే విషయాన్ని డీకోడింగ్ ద్వారా తెలుసుకుంటారు. దీనికి ఐఎంఇఐ నెంబర్ కీలక ఆధారంగా ఉంటుంది.

ఈ నేపథ్యంలోనే ఇటీవల ఇంటెలిజెన్స్‌ బ్యూరో అధికారులు భద్రతా కారణాలను పరిగణలోకి తీసుకుని చైనా తయారీ మొబైల్‌ ఫోన్ల అమ్మకాలను మన దేశంలో నిషేధించాలంటూ కేంద్ర హోంమంత్రిత్వశాఖ, టెలికమ్యూనికేషన్స్‌ శాఖలకు సిఫార్సు చేసింది. ఈ సిఫార్సు నేపథ్యంలోనే మన దేశంలో చైనా తయారీ మొబైల్‌ ఫోన్ల విక్రయాలను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఫలితంగా కొత్త సంవత్సరం తొలివారంలో దేశవ్యాప్తంగా 2.5 కోట్ల మొబైల్‌ ఫోన్ల కనెక్షన్‌ రద్దయ్యే అవకాశం ఉంది. ఇటీవలి కాలంలో పెరిగిపోతున్న ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో టెలికాం శాఖ (డాట్‌) సూచనల మేరకు జనవరి ఆరో తేదీ నుంచి దాదాపు 2.5 కోట్ల మొబైల్‌ ఫోన్లకు సర్వీసులను నిలిపివేయడానికి టెలికాం కంపెనీలు సిద్ధమవుతున్నాయి.

వెబ్దునియా పై చదవండి