ప్రపంచవ్యాప్తంగా కమ్ముకున్న ఆర్థిక మాంద్య మేఘాలు ఇప్పుడిప్పుడే తొలగిపోతున్నాయి. వర్ధమాన దేశమైన భారత ఐటి మార్కెట్ ఇప్పుడిప్పుడే సరైన గాడిలో పయనిస్తోంది. దాదాపు రెండేళ్ల పాటు మార్కెట్ ఒడిదుడుకులును ఎదుర్కున్న ఐటి కంపెనీలు ఇప్పుడు కొత్త జోరును అందుకుంటున్నాయి.
ఓ వైపు భారత ఐటి, ఐటిఈఎస్ సెక్టార్ విలువ 60 బిలియన్ డాలర్లకు చేరుతున్న తరుణంలో డిమాండ్‌కు తగ్గట్టుగా సేవలను అందించే దిశగా దేశంలోని టాప్ 2 ఐటి సంస్థలు టిసిఎస్, ఇన్ఫోసిస్‌లు సంయుక్తంగా 90 వేల కోత్త కొలువులను ఇవ్వడానికి ముందుకు వచ్చాయి.
మొదట్లో టిసిఎస్ 30 వేల కొత్త ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నప్పటికీ.. అనంతరం ఆ సంఖ్యను 50 వేలకు పెచుకుంది. టిసిఎస్ బాటలోనే ఇన్ఫోసిస్ కూడా తొలుత 36 మందికి ఉద్యోగ అవకాశాలు ఇస్తామని ప్రకటించగా.. తర్వాత వారి సంఖ్యను 40 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించింది.
File
FILE
ఆర్థిక ఫలితాలతో సంబంధం లేకుండా.. కొత్త సిబ్బందిని చేర్చుకోవడంలో ఐటి కంపెనీలు పోటీ పడుతున్నాయని, ఈ కంపెనీలు అభివృద్ధి ప్రణాళికలను అమలు చేస్తున్నాయని కెల్లి ఐటి రిసోర్సెస్ డైరెక్టర్ బిఎన్ తమ్మయ్య వ్యాఖ్యానించారు. సమీప భవిష్యత్తులో ఈ నియామకాలు మరింత జోరందుకుంటాయని ఆయన అన్నారు.
ఐటి కంపెనీల ఆర్థిక ఫలితాల్లో కొంత మేరకు ఒత్తిడులు ఉన్నప్పటికీ అది తాత్కాలికమే అనేది విశ్లేషకుల వాదన. 2008, 2009 సంవత్సరాల్లో కొనసాగిన ఆర్థిక మాంద్యం కారణంగా అగ్రశ్రేణి కంపెనీలు సైతం చతికిలబడ్డాయి. చాలా కంపెనీల్లో ఉద్యోగుల వేతనాలు పెరగలేదు సరికదా.. కొన్ని కంపెనీలు ప్రోత్సాహకాలను తగ్గించాయి.
మరికొన్ని సంస్థలైతే ఏకంగా తన ఉద్యోగులకు చరమ గీతం పాడాయి. గతంలో సిబ్బంది కోసం ఐటి కంపెనీలు ఉద్యోగులను వెతుక్కుంటూ.. క్యాంపస్ సెలక్షన్ల బాట పట్టవేవి. కానీ గడచిన రెండేళ్లలో మాత్రం ఈ క్యాంపస్ ప్లేస్మెంట్లు నామమాత్రంగానే జరిగాయని చెప్పవచ్చు.
కానీ.. ఇప్పుడు మాత్రం విద్యా సంవత్సరం పూర్తి కాకుండానే నైపుణ్యం ఉన్న విద్యార్ధులను ఆకర్షించేందుకు ఐటి కంపెనీలు పోటీ పడుతున్నాయి. మాంద్యం కారణంగా ఐటి ప్రాజెక్టులను వెనక్కు తీసుకున్న అగ్ర రాజ్యాలు కూడా ఇప్పుడు వాటిని పునరుద్ధరించుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి.
పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా సేవలు అందించాలంటే.. ఐటి కంపెనీలు తమ హెడ్ కౌంట్‌ను పెంచుకోక తప్పదు. ఇండస్ట్రీ బాడీ నాస్కామ్ గణాంకాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో ఐటి పరిశ్రమ లక్ష ఉద్యోగాల వరకూ ఇవ్వనుందని అంచనా వేసింది. ఇదే సమయంలో నియామకాలతో పాటు అట్రిషన్ రేట్ కూడా ఎక్కువగా ఉండటం గమనార్హం. ఏదైతేనేం ఐటి పరిశ్రమకు మంచి రోజులు వచ్చాయనే చెప్పవచ్చు.