నరాలు తెగే ఉత్కంటతో టీవీలో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు, లేదా సెంటిమెంట్ సీరియల్ కన్ను ఆర్పకుండా చూసే వాళ్లకు ఒక్కసారిగా టీవీ రిమోట్ బ్యాటరీ అయిపోయి పని చేయడం ఆగిపోయిందనుకోండి.....? ఇంకేముంది ఆ కోపమంతా రిమోట్‌పైన చూపించేస్తాం కదూ....! ఇకపై మనకి ఆ సమస్య ఉండదంటున్నారు జపాన్ శాస్త్రవేత్తలు. ఈ కోపాన్ని ఉపయోగించే జపాన్ శాస్త్రవేత్తలు ఓ కొత్త బ్యాటరీకి రూప కల్పన చేశారు. ఇక వివరాల్లోకి వెళితే....
జపాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ సంస్థ బ్రదర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఊపితే(షేక్ టు రీచార్జ్) రీచార్జ్ అయ్యే బ్యాటరీలను తయారు చేసింది. "వైబ్రేషన్-పవర్డ్ జనరేటింగ్ బ్యాటరీ"గా పిలువబడే ఇది ఒక చిన్న డబల్-లేయర్ కెపాసిటర్‌ను, ఎలక్ట్రోమాగ్నటిక్ ఇండక్షన్ జెనరేటర్‌ను కలిగి ఉండి షేక్ చేసినపుడు రీచార్జ్ అవుతుంది. ఇందులో ఏఏ-సైజు బ్యాటరీలు జనరేటర్‌ను, కెపాసిటర్‌ను అనుసంధానింపబడి మనకు కావలసిన వోల్టేజిని అందిస్తాయి.
ఏఏ-సైజు, ఏఏఏ-సైజులలో లభించే ఈ బ్యాటరీలు 4-8 హెర్ట్జ్‌ల పౌనఃపున్యం(ఫ్రీక్వెన్సీ) వద్ద 10-180 మిల్లీవాట్ల(0.2-2.0 వాట్స్) విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయి. మొత్తం పరికరాన్న షేక్ చేయడం వల్ల ఇందులో ఉన్న మినీ-జనరేటర్ పనిచేయడం ప్రారంభిస్తుంది తద్వారా విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. అయితే ఇలా ఉత్పత్తి అయిన విద్యుత్ కేవలం ఒక కెమెరా ఫ్లాష‌్‌కి సరిపడా మాత్రమే.
ఇవి టీవీ రిమోట్, ఏసీ రిమోట్ వంటి తక్కువ విద్యుత్‌తో పనిచేసే పరికరాలకు మాత్రమే సరిపోతాయి. డిజిటల్ కెమరాల వంటి అధిక విద్యుత్ అవసరమయ్యే పరికరాలకు ఇవి సరితూగవు. కాగా.. ఇప్పటికే ఈ టెక్నాలజీని ఫ్లాష్‌లైట్, గ్యారేజ్ డోర్ ఓపెనర్స్ వంటి వాటిలో వాడుతున్నారు. అయితే ఏఏ-సైజులో వాడటం ఇదే మొదటిసారి. టోక్యోలో జరగనున్న టెక్నో-ఫ్రంటీర్ 2010 ఎగ్జిబిషన్‌లో బ్రదర్ ఇండస్ట్రీస్ ప్రదర్శించనున్నారు.