భారతీయ పీసీ మార్కెట్ కోసం కొత్త మోడళ్లు

Pavan Kumar

శుక్రవారం, 11 జులై 2008 (19:33 IST)
భారతీయ పీసీ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని అనేక కంపెనీలు కొత్త మోడళ్లు రూపొందించేందుకు చర్యలు చేపట్టాయి. వినియోగదారులకు సరసమైన ధరలకు అతి చౌకగా అందించేందుకు ఆయా కంపెనీలు పోటీపడుతున్నాయి. ప్రపంచంలో అత్యంత వేగంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని పుణికిపుచ్చుకున్న దేశాల్లో భారత్ ఒకటి.

మారుతున్న కాలానికి తగ్గట్టుగా భారతదేశ వాసులు విద్యా పరంగా చాలా ముందున్నారు. భారతీయ విద్యార్ధులు ఇన్నాళ్లూ వివిధ కోర్సులు చదివి ఉద్యోగాలు చేసేవారు నేడు ఐటీ రంగంపై దృష్టి సారించారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు ఐటీ ఆధారిత విద్యను అందించే కళాశాలను ఏర్పాటుచేస్తున్నాయి.

ఐటీ ఆధారిత విద్యా సంస్థలకు సహకరించేందుకు అనేక ఐటీ కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ఇందులో భాగంగా వారితో ఒప్పందం చేసుకుని తమ ఉత్పత్తుల వినియోగాన్ని భారీగా పెంచుకుంటున్నాయి. దీనితో పీసీలు వినియోగం భారీగా పెరిగింది.

భారతీయ మార్కెట్ కోసం హెచ్‌పీ కంపెనీ ఇటీవల Dx2009 మోడల్ లేదా మినీ డీటీ బిజినెస్ డెస్క్‌టాప్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీని ధర రూ. 12,500లు మాత్రమే. మనదేశంలో డెస్క్‌టాప్స్ వాడకం ఇటీవల కాలంలో బాగా పెరిగిందని హెచ్‌పీ ఇండియా ప్రతినిధి అరుణ్ రావు చెప్పారు.

పీసీలు ఉత్పత్తిచేసే కంపెనీలు వాటి ధరలను భారీగా తగ్గించటంతో వినియోగదారుల సంఖ్య వృద్ధి చెందిందని వివరించారు. రేటు తక్కువైనా ఈ పీసీల్లో అన్నిరకాల సదుపాయాలు ఉన్నాయన్నారు. తాము రూపొందించిన మినీ డీటీలను ఎక్కువగా చిన్న, మధ్యతరహా వ్యాపారవేత్తలు బాగా వినియోగిస్తున్నారని తెలియజేశారు.

హెచ్‌పీ కంపెనీ మార్గంలోనే ఇంటెల్, ఎఎండీ, డెల్, విప్రోలు నడుస్తున్నాయి. ఆయా కంపెనీలు వాణిజ్య మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందిస్తున్నాయి. ఎఎండీ-విప్రోలు సంయుక్తంగా తక్కువ ధర లాప్‌టాప్‌ను రూపొందిస్తున్నాయి. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ (సీపీయూ) ను ఎఎండీ రూపొందించిన సీపీయూను విప్రో మార్కెటింగ్ చేయనుంది.

ఇంటెల్ కంపెనీ విద్యార్ధుల కోసం క్లాస్‌మేట్ పీసీని తయారుచేస్తుంది. ఇది ముఖ్యంగా విద్యా రంగం కోసం కావడం గమనార్హం. దీని ధర రూ.12,900లుగా ఉండవచ్చు. భారత మార్కెట్‌లో క్లాస్‌మేట్ పీసీ రాణించగలదని నిపుణులు అంచనా వేశారు.

వెబ్దునియా పై చదవండి