పల్లెలంటే భయపడుతున్న కిరణ్ సర్కారు : వైఎస్.జగన్

మంగళవారం, 22 నవంబరు 2011 (17:59 IST)
దేశానికి, రాష్ట్రానికి పల్లెలు పట్టుకొమ్మలని, అలాంటి పల్లెలకు రావాలంటే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం భయపడుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా ఓదార్పు యాత్రలో భాగంగా ఆయన మంగళవారం మాట్లాడుతూ పల్లెలకు రావాలంటే కిరణ్ సర్కారు భయపడుతోందని, అందుకే మండల కేంద్రాల్లో రచ్చబండ కార్యక్రమాన్ని తూతూ మంత్రంగా ముగిస్తోందన్నారు.

దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి రచ్చబండ ద్వారా పల్లె ప్రజల్లో అర్హులందరికీ పథకాలు అందాలని కలలు కంటే ఈ ప్రభుత్వం అందుకు విరుద్దంగా వెళుతోందన్నారు. పల్లె ప్రజల కోసం ఏర్పాటు చేసిన రచ్చబండ మండల కేంద్రాల్లో ఏర్పాటు చేయడాన్ని తమ పార్టీ తప్పుబడుతున్నట్టు చెప్పారు.

వైఎస్ పాలనలో అర్హులైన వారందరికీ ఇళ్లను మంజూరు చేశారన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యేలు సిఫార్సు చేసిన వారికే ప్రభుత్వం ఇళ్లను మంజూరు చేస్తామని చెప్పడం సిగ్గు చేటన్నారు. వైఎస్ తర్వాత ఏ ఒక్క నాయకుడూ పేదలకు మేలు చేయాలనే ఆలోచన చేయక పోవడం చాలా బాధగా ఉందని జగన్ అన్నారు.

వెబ్దునియా పై చదవండి