"పిట్ట కొంచెం.. కూత ఘనం" అనిపించిన ప్రణవ్

"పిట్టకొంచెం... కూత ఘనం" సామెతకు సరిగ్గా సరిపోతాడు ఈ ఆరేళ్ల భారత సంతతికి చెందిన బుడతడు ప్రణవ్ వీరా ఐక్యూ 176. ప్రణవ్ వయసు ఆరేళ్లయినా, ఐన్‌స్టీన్ కంటే గొప్ప మేధాస్సు కలిగినవాడని చెప్పవచ్చు. ఎందుకంటే, ఐన్‌స్టీన్ ఐక్యూ 160 మాత్రమే కాగా, ఈ బుల్లి మేధావి ఐక్యూ మాత్రం 176. దీంతో ప్రణవ్ ఐన్‌స్టీన్ కంటే అధిక శక్తి సామర్థ్యాలున్నవాడిగా పరిగణింపబడుతున్నాడు.

నాలుగన్నర సంవత్సరాలప్పుడే ఇంగ్లీషులోని ఆల్ఫాబెట్లన్నింటినీ పై నుంచి కిందకు, కింద నుంచి పైకి చకచకా చెప్పేవాడని ప్రణవ్ తల్లిదండ్రులు ప్రసాద్, సుచిత్రా వీరాలు సంతోషంగా చెబుతున్నారు. ఇప్పుడు ఆ బాలుడు... అమెరికా అధ్యక్షులుగా పనిచేసిన వారందరి పేర్లను వరుస క్రమంలో ఏకధాటిగా చెప్పేస్తాడని వారు వెల్లడించారు.

అలాగే... గడచిపోయిన సంవత్సరాలకు సంబంధించి... ఏ తేదీన ఏ వారం, ఏ రోజు వస్తుందో కూడా ఈ బుడతడు గుక్క తిప్పుకోకుండా చెప్పేస్తాడట. ఇకపోతే... వీడియో గేమ్‌లు ఆడటంలో అయితే ప్రణవ్‌ది అందవేసిన చెయ్యే సుమా...! ఇంత చిన్న వయస్సులోనే అతడి పరిణతిని చూసి ముచ్చటపడనివారు లేరంటే నమ్మండి.

ఇదే విషయాన్ని... మిల్‌ఫోర్డ్‌లోని మెక్ కార్మిక్ ఎలిమెంటరీ పాఠశాల ఉపాధ్యాయిని మాట్లాడుతూ... తమ స్కూల్లో చదువుతున్న ప్రణవ్ సామాన్యుడు కాడనీ, అతడి అసాధారణ ప్రతిభా సామర్థ్యాలను చూస్తే ముచ్చటేస్తుందని సంతోషం వ్యక్తం చేశారు.

ఇలా ఉంటే... నువ్వు భవిష్యత్తులో ఏం చేస్తావ్ నాన్నా అని ఎవరైనా అడిగితే, ఎలాంటి తడబాటూ లేకుండా ఖగోళ శాస్త్రవేత్తనవుతానని చెబుతున్నాడు ఈ చిన్నారి ప్రణవ్. సో... పిల్లలూ... ప్రణవ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పేద్దామా...!

వెబ్దునియా పై చదవండి