కళలను ప్రోత్సహించడానికి జిల్లా యంత్రాంగం నుంచి అన్ని సహాయ సహకారాలను అందిస్తానని జిల్లా కలెక్టర్ డా. బి. జనార్థన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం ఉదయం స్థానిక పోతన విజ్ఞాన పీఠంలో నటరాజ కళాకృష్ణ నృత్యజ్యోతి అకాడమి ఆరవ వార్షికోత్సవం కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. దేవుడు మనుషులను పుట్టిస్తే, మనుషులు కళలను పుట్టిస్తారని వాటిని నిరంతరం మనం కాపాడుకోవాలని కలెక్టర్ అన్నారు.
"పేరిణీ నృత్యం" గురించి కలెక్టర్ మాట్లాడుతూ... కాకతీయుల కాలంలో యుద్ధానికి వెళ్లే సైన్యాన్ని ఉత్తేజపరిచి, ఉత్సాహపరిచేందుకు ప్రేరణగా ఈ పేరిణి శివతాండవం చాలా బాగా ఉపయోగపడేదని, అలాగే ఆ నాట్యాన్ని ప్రేరణగా తీసుకుని అందరు తాము చేస్తున్న పనులను ఉత్సాహంగా, ఉత్తేజంతో చేయాలని వెల్లడించారు.
వరంగల్‌లో ఆగస్టు మొదటి తేదీ నుంచి పేరిణి నృత్యంలో డిప్లమా కోర్సు ప్రారంభమవుతుందని, తద్వారా కళలకు మరింత సన్నిహితం కావచ్చునని జనార్థన రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. నటరాజ కళాకృష్ణ నృత్యజ్యోతి అకాడమీ అధ్యక్షులు గజ్జెల రాజ్‌కుమార్ శాస్త్రి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సంబంధాల అధికారి కె. వెంకటరమణ, న్యూసైన్స్ అండ్ డిగ్రీ, పి.జి. కాలేజీ ఛైర్మన్ ఎం. పాండురంగారావు, సీనియర్ అడ్వకేట్ ఎం. వీరస్వామి, హైదరాబాద్ ఆంధ్ర నాట్య సంఘం అధ్యక్షులు శ్రీమతి రాఘవ కుమారి, కోశాధికారి సువర్చనా దేవి, సెక్రటరీ డాక్టర్ సునీలా ప్రకాష్, పేరిణి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
అంతకుముందు అకాడమీ కళాకారులు ప్రదర్శించిన పేరిణి నృత్యం, ఆంధ్య నాట్యం ప్రదర్శనలను చూపి మైమరిచిన జిల్లా కలెక్టర్ కళాకారులను పేరు పేరునా అభినందించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని డా. సువర్చలా దేవి, శ్రీమతి రాఘవ కుమారి, పేరిణి ప్రకాష్, సునీలా ప్రకాష్, మృదంగ కళాకారులు బలరామ్, నూకల నాగేశ్వరరావులను జిల్లా కలెక్టర్ శాలువా కప్పి సత్కరించారు.