పిల్లలకు సమయం విలువ నేర్పించడం ఎలా..?

బుధవారం, 13 మార్చి 2019 (12:44 IST)
పిల్లలకు చిన్నప్పటినుండి సమయపాలన అలవాటు చేయడం ఎంతో ముఖ్యమని చెప్తున్నారు. ఎందుకంటే విజయానికి మూలసూత్రాల్లో అది కూడా కీలకమే. పిల్లలు ప్రతీ చిన్న విషయాన్ని తల్లిదండ్రుల నుండే నేర్చుకుంటారు. అందుకే ముందు మీ నుండే మొదలుపెట్టండి. ఉదయం లేచిన దగ్గరనుండి రాత్రి పడుకునే వరకు ప్రతిపనీ పద్ధతిగా అనుకున్న సమయానికి పూర్తిచేయాలి.
 
అంటే మధ్యాహ్నం పన్నెండుకు భోజనం, రాత్రి తొమ్మిదికి నిద్ర, ఉదయం ఆరుగంటలకు లేవడం.. ఇలా ప్రతిదానికి ఓ సమయం నిర్దేశించుకుని దానికి కట్టుబడి ఉండాలి. అప్పుడే పిల్లలు మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు. మీ చిన్నారులకు ఏదైనా పని అప్పగించండి. అనుకున్న సమయానికి వందశాతం దాన్ని పక్కాగా పూర్తిచేయగలిగితే.. అభినందించి చిన్న కానుక ఇవ్వండి.
 
ఇలా చేస్తుంటే పిల్లలు ఇంకాస్త ఉత్సాహంతో సమయపాలనకు ప్రాధాన్యం ఇస్తారు. ఒకవేళ హోంవర్క్‌ని అనుకున్న సమయం కంటే తొందరగా పూర్తి చేయగలిగితే.. ఆ సమయంలో వారికి నచ్చే ఆటవిడుపు కల్పించాలి. ఇవన్నీ కూడా వారు ప్రతి పనీ ప్రణాళికాబద్ధంగా చేయడానికి అలవాటు పడేందుకు తోడ్పడుతుంది.
 
సమయం పాటించడం వలన పిల్లలలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఓ చేతి గడియారం కానుకగా ఇచ్చి సమయపాలన ఎలా చేయాలో నేర్పించాలి. ప్రతీసారి మీరు వెనకనుండి సమయాన్ని గుర్తు చేయకుండా దాని విలువ చెప్పగలగాలి. ఈ జాగ్రత్తలన్నీ వాళ్లకు భవిష్యత్తులో ఉపయోగపడుతాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు