ఎరేజ్-ఎక్స్‌తో పిల్లల ఆరోగ్యానికి ముప్పు

కాగితంపై రాసిన అక్షరాల్లో తప్పులను సరిదిద్దేందుకు ఉపయోగించే ఎరేజ్-ఎక్స్ (కరెక్షన్ ఫ్లూయిడ్) ద్రావకం... చిన్నారుల ఆరోగ్యాలను ప్రమాదంలోకి పడవేసి, బాల్యాన్ని మత్తులో ముంచేస్తోందని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇథాలిన్ పదార్థంతో తయార్యే దీన్ని చాలామంది కూలీనాలీ చేసుకునే పేద పిల్లలు మత్తుపానీయంలాగా వాడుతున్నారనీ... పిల్లలకు ఈ పదార్థాన్ని విక్రయించరాదన్న నిబంధనలు ఉన్నప్పటికీ వ్యాపారస్తులు యధేచ్చగా అమ్ముతున్నారని వైద్య నిపుణులు వెల్లడించారు.

ఎరేజ్-ఎక్స్‌లో సిగరెట్, మద్యం, గంజాయి కంటే ఎక్కువగా విషపదార్థాలున్నాయనీ... దీన్ని తీసుకోవటం వల్ల ఓ అరగంటపాటు మత్తుగా ఉంటుందనీ, దీనికి లొంగిపోతున్న బాలలు వారి జీవితాలను బలి చేసుకుంటున్నారని నిపుణులు పేర్కొంటున్నారు.

ఈ విషయమై డాక్టర్ స్రవంతి మీడియాతో మాట్లాడుతూ... ఎరేజ్-ఎక్స్ తీసుకున్నట్లయితే న్యూమోనియా వ్యాధికి గురై, ఊపిరితిత్తులు పూర్తిగా నాశనమవుతాయని చెప్పారు. ఈ ద్రావకం త్రాగటం వల్ల రక్తకణాలు విచ్ఛిన్నమవడం, గడ్డ కట్టడం లాంటి ప్రమాదాలే కాకుండా, మెదడుపైనా తీవ్రమైన ప్రభావం చూపిస్తుందని హెచ్చరిస్తున్నారు.

ఒకసారి ఈ ద్రావకాన్ని తీసుకున్నట్లయితే.. ఆ తరువాత దానికి పూర్తిగా బానిసల్లాగా తయారవుతారనీ, గంజాయికంటే ఇది చాలా ప్రమాదకరమైనదని స్రవంతి అన్నారు. దీనికి అలవాటుపడ్డవాళ్లు, మత్తు సరిపోక మరింత ఎక్కువగా తీసుకుంటారనీ.. ఫలితంగా మరణించే ప్రమాదమూ ఉందని తెలిపారు.

ఎరేజ్ ఎక్స్ ఎంతటి ప్రమాదకారి అంటే... ఇది ఏదేని చిన్న మొక్కపైన పడినా, దాని పెరుగుదల ఆగిపోతుందని వైద్యులు చెప్పారు. సాధారణంగా మద్యం లాంటి మత్తు పదార్థాలు మూత్రం, తదితర విసర్జకాల ద్వారా శరీరం నుండి బయటకు వెళతాయనీ, అయితే ఈ ద్రావకం మాత్రం మూత్రపిండాల్లో ఉండిపోయి ప్రాణాంతకంగా పరిణమిస్తుందని ఆవేదనగా అన్నారు. కాబట్టి, తల్లిదండ్రులు ఎరేజ్ ఎక్స్ బారినుండి పిల్లలను కాపాడుకోవాలని, లేకపోతే ప్రాణాలతో దక్కరని వైద్యులు సలహా ఇస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి