ఏటా 20 లక్షలమంది చిన్నారుల మృతి

భారత దేశంలో ప్రతి సంవత్సరం 20 లక్షల మంది చిన్నారులు మృత్యు ఒడిలోకి చేరుతున్నట్లు అంతర్జాతీయ దాతృత్వ సంస్థ "సేవ్ ది చిల్డ్రన్" వెల్లడించింది. వీరిలో 60 శాతం మంది పిల్లలు కేవలం పుట్టిన 28 రోజులకే మరణిస్తున్నట్లు ఆ సంస్థ పేర్కొంది.

మంగళవారం రోజున ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఒక ప్రకటనను విడుదల చేసిన సేవ్ ది చిల్డ్రన్ సంస్థ... కలరా, మలేరియా, నిమోనియా లాంటి వ్యాధులు పసివారి మరణాలకు కారణమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది.

ప్రపంచంలోని ప్రతి నలుగురు చిన్నారుల్లో ఒకరు ఏడాది వయసు లోపలే మృత్యు ఒడికి చేరుకుంటున్నారనీ... అలాగే భారతదేశంలో ప్రతి ముగ్గురు చిన్నారుల్లో ఒకరు పోషకాహార లోపంతో మరణిస్తున్నారనీ సేవ్ ది చిల్డ్రన్ సంస్థ తన ప్రకటనలో వివరించింది.

కాబట్టి.. ఆయా దేశాల ప్రభుత్వాలు చిన్నారుల మరణాలను ఆపాలంటే... వారి మరణాలకు కారణాలుగా ఉంటున్న వ్యాధుల నివారణకు తగిన కృషి చేయాలని సేవ్ ది చిల్డ్రన్ సూచించింది. అంతేగాకుండా.. భారత్‌లో ప్రధానంగా పోషకాహార లోపంతో మృత్యు ఒడికి చేరుకుంటున్న చిన్నారులను కూడా కాపాడాలని ఆ సంస్థ విజ్ఞప్తి చేసింది.

వెబ్దునియా పై చదవండి