స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రంలో నటించిన అజహర్, రుబీనాల చదువుకు స్పాన్సర్షిప్ దొరికింది. కానీ మిగిలిన బాలనటులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వారు పాఠశాలకు వెళ్లాలంటే సాధ్యమయ్యే పనిగా కనిపించడం లేదు.
మరోవైపు కొందరు బాలనటులు పాఠశాలలకు వెళుతున్నప్పటికీ వారిని వెతుక్కుంటూ కొన్ని సినీ అవకాశాలు వస్తున్నాయి. అయితే ఆ చిత్రాల్లో నటించాలని ఉత్సాహపడుతున్న బాలనటుల ఆశలు మాత్రం తీరడం లేదు. పరీక్షలు దగ్గరపడుతున్న ప్రస్తుత స్థితిలో పిల్లలను షూటింగ్లకు ఎలా పంపగలమని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. దీంతో బాలనటుల తల్లిదండ్రులు ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నారు.
ఇదిలా ఉంటే, ఉర్దూ మీడియం పాఠశాలలో చదువుతున్న రెండో తరగతి కుర్రాడు సల్మాన్, మూడో తరగతి చదువుతున్న అర్బాజ్లిద్దరూ చదువు మానేసి సినీ ఛాన్సులుకోసం స్టూడియోల చుట్టూ తిరుగుతున్నారు. అర్బాజ్ చదువు మానేయడానికి ఆర్థిక సమస్యలే కారణమని అతని తల్లి బిలాకిస్ అఫ్జల్ ఖాన్ వెల్లడించారు. తన భర్త మరణించాడనీ, తన పిల్లల సంపాదనే కుటుంబానికి పూర్తి ఆధారమని ఆమె విచారవదనంతో చెప్పారు.
మిగిలిన బాలనటుల పరిస్థితి కూడా దాదాపుగా ఇలానే ఉందని సమాచారం. ప్రపంచంలో భారతీయ చలనచిత్ర పరిశ్రమ గర్వపడేలా ఆస్కార్ అవార్డుల పంట పండించిన బాలనటులకు తగిన చేయూతనందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.