ప్రపంచం ఆధునిక యుగంలో అన్ని రకాల సాధనాలతో సౌకర్యాలను అనుభవిస్తోంది. వినోదానికి కావలసిన వస్తువులలో మనం టీవీలనుకూడా ఉపయోగిస్తున్నాం. అందులో సందేహం లేదు. ప్రతి ఒక్కరు ఇంటికి వెళ్ళడంతోటే టీవీలకు అతుక్కుపోతుంటారు.
ప్రస్తుతం టీవీలలో వస్తున్న ధారావాహిక కార్యక్రమాలు(సీరియల్) మన జీవితాలతో ముడిపడివున్నాయి. వీటివలన ప్రతి ఇంట్లోనూ వివాదాలు చెలరేగుతున్నాయి. వీటిపై మనం ఇక్కడ చర్చించలేము. గతంలో కొన్ని ధారావాహిక కార్యక్రమాలు వస్తున్నప్పుడు ఇండ్లల్లోని పరిస్థితి చాలా బాగుండింది. అవి సమాజానికి ఉపయోగపడేటివిగా ఉన్నాయి.
కాని ప్రస్తుత పరిస్థితి దానికి విపరీతంగావుంది. ఇప్పుడు వస్తున్న రియాల్టీ షోలగురించి ప్రస్తావిస్తే ఇందులో పిల్లల సామర్థ్యం బయటపడుతుందని తల్లిదండ్రులు అభిప్రాయపడుతుంటే నిర్వాహకులు మాత్రం తమకు లాభసాటిగా వచ్చే కార్యక్రమాలనే రూపొందించి పిల్లల జీవితాలతో చెలగాటమాడుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
టీవీలు తమ రేటింగ్‌ను పెంచుకోవడానికి ప్రస్తుతం చిన్న పిల్లలనుకూడా పాల్గొనేలా పురమాయిస్తున్నాయి. ఇందులో పిల్లల్లో దాగున్న సామర్థ్యాన్ని వెలికి తీసే ఉద్దేశం ఎలావున్నా, ఈ కార్యక్రమ నిర్వాహకులు తమ స్వార్థంతోనే ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు సమాచారాలు వస్తున్నాయి.
రియాల్టీ షోల పేరుతో టీఆర్పీ రేటింగ్‌ను పెంచుకోవటానికి చిన్న పిల్లలను బలి చేస్తుంటారు. ఇక్కడ గెలిచేది మాత్రం కార్యక్రమ నిర్వాహకులు మాత్రమే, కాని పిల్లలు మాత్రం తమ చదువులు, ఆనందాన్ని వదిలి వీటిపై శ్రద్ధ వహించడంతో వారు ఎంతో విలువైన సమయాన్ని, బాల్యానందాన్ని కోల్పోతున్నారు.
తొలుత వారిని గెలిపించినట్లు, షోలలో పాల్గొనే పిల్లలను మించిన వారు లేరన్నట్లు వారిని ఊదరగొడుతుంటారు. దీంతో వారిలో చిన్నప్పటినుంచే ఒకరకమైన మానసిక పరిస్థితి తలెత్తుతుందని మానసిక వైద్యులు తెలిపారు. ఇలాంటి రియాల్టీషోలు పిల్లల జీవితంలో మంచికన్నాకూడా చెడుప్రభావం అధికంగా వుంటుందని, ఇది వారిపై, వారి జీవితంపై దుష్ప్రభావం చూపే పరిస్థితి ఉందని వారు అభిప్రాయపడ్డారు.
పిల్లలు పసి మొగ్గలు
పిల్లలు శారీరకంగా, మానసికంగాకూడా అతి కోమలమైన, మృదువైన స్వభావం కలవారు. వారివలన చిన్న పొరపాటు జరిగినాకూడా అది వారి మనసులో అలా ముద్రపడిపోతుంది. వారిని ప్రోత్సహించడంపోయి, విమర్శించి వారిలోని లోపాలను ఎత్తి చూపడం సరికాదంటున్నారు విశ్లేషకులు.
చదువుకునే సమయంలో చదువుతోబాటు ప్రతిస్పర్థ నెలకొంటుంది. అక్కడే డబ్బు, గౌరవం, పేరులాంటివి వారిని చిన్న వయస్సులోనే పెద్ద మనుషులుగా మార్చేస్తుంది. దీంతో వారు రియాల్టీ షోలలో గెలుపును పొందలేకపోయినప్పుడు వారి మానసిక పరిస్థితి చాలా దిగజారిపోతుందని వైద్యులు తెలిపారు.
దీనివలన వారు ఆత్మహత్యలకు పాల్పడినట్లు కొన్ని సమాచారాలు కూడా వారికి అందినట్లు మానసిక వైద్యనిపుణులు తెలిపారు. అలాగే వారు తమ మానసిక ఒత్తిడినుంచి బయట పడటానికి వైద్యులను సంప్రదించినట్లుకూడా సమాచారం. కాగా రియాల్టీ షోల పేరుతో పిల్లల జీవితాలతో ఆడుకోవడం ఎందుకు అని వారు ప్రశ్నిస్తున్నారు.
పిల్లల మానసిక పరిస్థితిపై ప్రభావం
ప్రస్తుతం అన్ని రకాల చానల్స్ కూడా తమ టీఆర్పీ రేటును పెంచుకోవడానికి పిల్లలను రియాల్టీ షోల పేరిట వారి జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇందులో ప్రముఖులు న్యాయనిర్ణేతలుగా వచ్చి అక్కడే పిల్లలముందు పోట్లాడుకుంటుంటారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటుంటారు. ఇది పిల్లలపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని వారు పేర్కొంటున్నారు. చివరికి ఇక్కడ జరిగే పోటీలు పిల్లలకా లేక పెద్దలకా అనేది సందేహంగా మారుతోంది.
నివారణోపాయం
** రియాల్టీ షోలో పాల్గొనే పిల్లల వయస్సులో మార్పు చేయాలి. 5 నుంచి 10 సంవత్సరాల లోపు వయసు కలిగిన పిల్లలు ఇలాంటి రియాల్టీ షోలలో పాల్గొననీయకుండా ప్రభుత్వం చట్టాలను రూపొందించాలి.
** పిల్లల్లోని శారీరక లోటుపాట్లను ఎత్తి చూపడంలాంటివి చేయకూడదు.
** కార్యక్రమాలలో పాల్గొనే న్యాయనిర్ణేతలు సంయమనంతో మాట్లాడాలి. దీంతో వారికి మంచి మాటలుకూడా నేర్పడానికి ప్రయత్నించాలి.
** ఇక్కడ పిల్లల్లో ఒకరిని ఎక్కువగా మరొకరిని తక్కువగా చూడటం భావ్యంకాదంటున్నారు విశ్లేషకులు
** పిల్లలను పాల్గొననిచ్చే ఇలాంటి షోలను ఫ్యాషన్ షోలుగా మార్చకూడదు.
** పిల్లలను ఎలిమినేషన్ రౌండ్లో చూపే దృశ్యాలు పదే పదే చూపకూడదంటున్నారు మానసిక వైద్య నిపుణులు.