గంధము పుయ్యరుగా...!!

గంధము పుయ్యరుగా పన్నీరు "గంధ"
అందమైన యదునందనుపై
కుందరదన లిరవొందగ పరిమళ "గంధ"

తిలకము దిద్దరుగా కస్తూరి "తిల"
కలకలమను ముఖకళ గని సొక్కుచు
పలుకుల నమృతము లొలికెడు స్వామికి "గంధ"

చేలము కట్టరుగా బంగారు "చేల"
మాలిమితో గోపాల బాలులతో
అలమేపిన విశాలనయనునికి "గంధ"

హారతులెత్తరుగా ముత్యాల "హార"
నారీమణులకు వారము యౌవన
వారక మొసగెడు వారిజాక్షునకు "గంధ"

పూజలు సేయరుగా మనసార "మన"
జాజులు మరి విరజాజులు దవనము
రాజిత త్యాగరాజనుతునకు "గంధ"

వెబ్దునియా పై చదవండి