ఆన్‌లైన్ డేటింగ్‌లలో జపాన్ తాతయ్యలు

WD
అవునండీ... ఇప్పుడు జపాన్ దేశంలో తాతయ్యలందరూ ఆన్‌లైన్ ప్రేమయణాలు సాగిస్తున్నారట. వారి ఘాటు ప్రేమ లేఖలను చూసి మనసు పారేసుకున్న టీనేజ్ అమ్మాయిలు తీరా వారిని చూసి నివ్వెరపోతున్నారట. పలువురైతే ప్రేమాయణం సాగించిన సదరు తాతయ్యల ఇంటిపై దాడికి దిగుతున్నారట. ఈ పరిణామంతో తాతయ్యల కొడుకలకు నవ్వాలో ఏడవాలో తెలియడం లేదట. వివరాలలోకి వెళితే...

జపాన్‌లో ప్రస్తుతం విచిత్రమైన పరిస్థితి నెలకొంది. మన దేశంలో కుర్రకారు సంఖ్య పెరిగిపోతున్నట్లు ఆ దేశంలో వృద్ధుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ప్రస్తుతం ఆ దేశంలో ప్రతి ఐదుగురిలో ఒకరు 60 ఏళ్లకు పైబడినవారై ఉన్నారు. వీరిలో కొందరు భార్యలను కోల్పోయినవారు... మరికొందరు కుటుంబాన్ని వదిలేసినవారు ఉన్నారు. ఇప్పుడు వీరంతా ఆన్‌లైన్ డేటింగ్‌లతో మహా బిజీగా ఉంటున్నారట. తాతయ్యల మత్తెక్కించే ప్రేమ రాతలతో 'దభేల్'మని ప్రేమ మైకంలో పడిపోతున్నారట అమ్మాయిలు. అయితే నిజం తెలిసిన తర్వాత బోసినోరు తాతను చూసి పారిపోతున్నారట.

అయినా తాతయ్యలు తమ డేటింగ్‌లకు స్వస్తి చెప్పడం లేదు. ఆ దేశంలో పెళ్లి సంబంధాలను కుదిర్చే మ్యాచ్ డాట్ కామ్‌ను సంప్రదిస్తూ తమను ఇష్టపడే అమ్మాయిలను చూసిపెట్టమని చెపుతున్నారట. చిత్రం ఏమిటంటే ఈ డాట్ కామ్‌లో సభ్యత్వం తీసుకున్నవారిలో 50 శాతానికిపైగా వృద్ధులే కావడం. అయితే తాతయ్యల డేటింగ్‌ల వ్యవహారాన్ని వారి కొడుకులు, కూతుళ్లు, మనవలు, మనవరాళ్లు చీదరించుకుంటున్నారట. కానీ ఈ ముసలోళ్ల దసరా పండుగ మాత్రం ఆగటం లేదట. ఏం చేద్దాం... కొంతమంది వృద్ధులు... లేటు వయసు ప్రేమికులు అనుకుందాం...

వెబ్దునియా పై చదవండి