మహాశివరాత్రి రోజున ఎర్రటి ప్రమిదలతో దీపాలు వెలిగిస్తే?

శుక్రవారం, 7 ఫిబ్రవరి 2014 (17:23 IST)
మహాశివరాత్రి రోజున ఆలయాల్లో శివ కళ్యాణము, 108 బిందెలతో రుద్రాభిషేకం చేయిస్తే ఓ అశ్వమేధయాగం చేసిన ఫలం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఆ రోజు సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో స్త్రీలు ఎర్రటి పువ్వులను శిరస్సున ధరించి, నుదుట కుంకుమ బొట్టు, విభూతితో ఎర్రటి ప్రమిదలతో దీపాలను వెలిగించడం ద్వారా దీర్ఘసుమంగళీ ప్రాప్తం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.

శివరాత్రి రోజు సాయంత్రాన కన్యలు నిష్ఠతో శివునికి ఎర్రటి ప్రమిదలతో దీపాలను వెలిగిస్తే గుణవంతుడైన భర్త లభిస్తాడని వారు అంటున్నారు. ఎర్రటి ప్రమిదలను తీసుకుని దూదితో ఐదు ముఖాల చేసుకుని, నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి. పంచహారతిగా వెలిగించే ఈ దీపాల ద్వారా సకల దేవగణాలను తృప్తి పరచినట్లవుతుందని పండితులు పేర్కొంటున్నారు.

మెడలో మీకు నచ్చిన రుద్రాక్ష ధరించి, ఈ దీపాలను పడమర దిక్కున వెలిగించి, "ఓం నమఃశివాయ" అని 108 సార్లు ధ్యానించే వారికి కైలాస ప్రాప్తం సిద్ధిస్తుందని విశ్వాసం. అదేవిధంగా.. ఆలయాల్లో పంచామృతముతో శివునికి అభిషేకం చేయిస్తే ఈతిబాధలు, దారిద్య్రాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.

వెబ్దునియా పై చదవండి