అలర్మేల్ వల్లి: భారతీయ శాస్త్రీయ నృత్య రీతుల్లో ఆణిముత్యం వంటి భరతనాట్యంలో పందనల్లూరు శైలి నృత్యసాంప్రదాయంలో నిష్ణాతురాలు. ప్రత్యేకంగా ఆమె ప్రదర్శించే శైలి ఎందరో ప్రముఖుల ప్రశంసలనందుకుంది. 1991లో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించడంతో నాట్యరంగంలో ఇంత చిన్నవయసులో ఈ అవార్డు అందుకొన్న కళాకారిణిగా ఖ్యాతిపొందారు. 2001లో సంగీత నాటక అకాడెమీ అవార్డు, 2004లో పద్మభూషణ్ అవార్డుల సత్కారం కూడా పొందారు.
నృత్యంపై తీసిన పలు డాక్యుమెంటరీల్లో ఆమె కనిపిస్తారు. ఉదాహరణకు బీబీసీ తీసిన 'స్పిరిట్ ఆఫ్ ఆసియా' సీరీస్‌లో, నెదర్లాండ్స్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ, జపనీస్ టెలివిజన్, ఫిలింస్ డివిజన్ ఆఫ్ ఇండియా వంటి సంస్థలు తీసిన డాక్యుమెంటరీల్లో తన విద్యను ప్రదర్శించారు. లలితకళల అభివృద్ధి కోసం చెన్నైలో దీపశిఖ అనే సంస్థను నెలకొల్పారు. ఈ కేంద్రంలో ఆమె భరతనాట్యం భోధిస్తున్నారు.
చన్నూలాల్ మిశ్రా : హిందూస్థానీ శాస్త్రీయ సంగీతంలో కిరానా ఘరానా సాంప్రదాయానికి చెందిన మహా విద్వాంసుడు. పద్మభూషణ్ అవార్డుతో పాటు; పండిత్జీకి ఉత్తరప్రదేశ్ సంగీత నాటక అకాడమీ అవార్డు, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ నౌషాద్ అవార్డు లభించాయి. బనారస్, పంజాబీ గాయకీ బాణీలతో ఆయన ఆలపించే ఖయాల్, దాద్రా, టుమ్రీ, భజన్ల ప్రక్రియలు విశేష అభిమానాన్ని చూరగొన్నాయి.
స్వయానా కన్నతండ్రి పండిత్ బద్రీ ప్రసాద్ మిశ్రా వద్ద, అనంతరం కిరానా ఘరానాకు చెందిన ఉస్తాద్ అబ్దుల్ ఘనీ ఖాన్ వద్ద శిష్యరికం చేసి వారి అభిమాన పాత్రుడైన పండిత్‌జీ, గానమాధుర్యంలో ఈ ఇద్దరు గురువుల ఛాయలూ ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. సంగీత అభినవేశంతో పాటు ఠాకూర్ జయదేవ్ సింగ్ నేతృత్వంలో భారత శాస్త్రీయ సంగీత మేధో పరిజ్ఞానాన్ని, అందులోని కళాసౌందర్య అభినివేశాన్ని స్వంతం చేసుకొన్నారు.
శుభా ముద్గల్ : సంగీతమే ఊపిరిగా జీవనం గడుపుతున్న కుటుంబంలో జన్మించారు. పండిత్రామ్ ఆశ్రేయ ఝా, పండిత్ వినయ చంద్ర మౌద్గల్య, పండిత్ వసంత్ ఠాకూర్ వంటి హేమాహేమీల సాన్నిధ్యంలో తనవిద్యకు మెరుగులద్దుకొన్నారు.
ఖయాల్, టుమ్రీ, దాద్రా వంటి హిందుస్తానీ శాస్త్రీయ రీతులతో పాటు ప్రఖ్యాత భారతీయ పాప్ సంగీతంలో ఆమె చూపిన ప్రతిభ ఇంటింటా ఆమె పేరును మారుమోగించిందనే చెప్పాలి. 2000లో పద్మ శ్రీ, 1998లో జరిగిన 34వ చికాగో అంతర్జాతీయ చిత్రోత్సవంలో సంగీతంలో ప్రత్యేక సాధన కేటగిరీలో రోల్డెన్ప్లేక్ అవార్డు వంటివెన్నో ఆమెను వరించాయి. స్వరకర్తగా కూడా ఆమె పేరుప్రఖ్యాతలు సంపాదించారు. శుభ గొంతులోంచి ఒలికే మధ్యయుగాల కాలంనాటి ఆధ్యాత్మిక, సూఫీ గీతాలతత్త్వం, వైష్ణవ పుష్టిమార్గ్ కవుల కృతులు, కబీరు, నామ్‌దేవ్, అమీర్ఖుస్రూల నిర్గుణ పరబ్రహ్మతత్త్వాలు శ్రోతలను ఆధ్యాత్మిక అనుభూతుల్లో ముంచెత్తుతాయి.
రవికిరణ్ : స్వయానా కన్నతండ్రి శిష్యరికంలో శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందిన ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసుడు. తన 5వ ఏటే తొలికచేరీ చేసిన బాలగంధర్వుడు. 10వ ఏటనే 21 తంత్రుల చిత్రవీణ వాదనలో నిష్టాతులయ్యారు. 1999 నుంచీ మళ్లీ గాత్ర సంగీత వైపు కూడా దృష్టి సారించిన ఆయన ఇప్పుడు ఈ రెండు శాఖల్లోనూ తన అసమాన ప్రతిభతో శ్రోతలను ఉర్రూతలూగిస్తున్నారు. సంగీత కచేరీలే కాకుండా, కర్ణాటకత సంగీతం గొప్పతనాన్ని వివరిస్తూ, సుసంపన్నం చేస్తూ లెవెల్ 1, లెవెల్ 2 పేరుతో రెండు శాస్త్రీయ గ్రంథాలను కూడా రాశారు. 1990లో అంతర్జాతీయ కర్ణాటక సంగీత సంస్థను స్థాపించారు. 'సంగీతానికి సేవ, సంగీతం ద్వారా సేవ' లక్ష్యంగా పనిచేసే లాభాపేక్షలేని సంస్థగా దీన్ని నిర్వహిస్తున్నారు.
తరుణ్ భట్టాచార్య : హిందుస్తానీ శాస్త్రీయ సంగీత విద్వాంసుడైన తరుణ్, సంతూర్ వాద్యకారులు కూడా. సంతూర్ కచేరీల్లోనే విప్లవాత్మకమైన ప్రక్రియలు సృష్టించిన ప్రయోక్తగా ఆయన పేరుగడించారు. తన తండ్రి రబీ భట్టాచార్య, దులాల్ రాయ్, సితార్విద్వాంసుడు పండిత్ రవిశంకర్ల వద్ద శిష్యరికంలో సంగీత విద్యను ఔపోసనపట్టిన ఆయన మైహార్ ఘరానాలో నిష్టాతులైన అతి కొద్దిమంది విద్వాంసుల్లో ఒకరు. ఏప్రక్రియకైనా సంసిద్ధులన్న పేరు గడించిన తరుణ్ స్వయంగానే కచేరీలు ఇవ్వడమే కాకుండా, ఇతర గాయకులు, వాద్యకారులతో కలిసి జుగల్బందీలు చేయడంలో సిద్ధహస్తులు, తన సహాధ్యాయి రవికిరణ్లో కలిసి ఆయన చేసిన జుగల్‌బందీలకు లెక్కే లేదు. హిందుస్థానీలోనే శిక్షణ పొందినా కర్ణాటక రాగాల్లోను ఆయనకు మంచి పట్టుంది.
డాక్టర్ ఎల్. సుబ్రమణియమ్ : భారత శాస్త్రీయ సంగీతానికి ఆరాధ్యుడిగా, భారత వయోలిన్ దైవంగా పేరుప్రఖ్యాతలు పొందారు. కర్ణాటక, పాశ్చాత్య శాస్త్రీయ సంగీతాల్లో శిక్షణ పొందిన ఆయన మాస్టర్ డిగ్రీ కూడా సాధించారు. సింఫనీలు, కర్ణాటక సంగీత కృతులను రచించడమే కాకుండా, సంగీతంపై కొన్ని గ్రంథాలు రచించారు. ఆయన కృతులు ప్రఖ్యాతి చెందిన పలు అంతర్జాతీయ రంగస్థలాలపైన, పలు నాట్యకంపెనీల ప్రదర్శనల్లోను పలుమార్లు ప్రతిధ్వనించాయి. ఈ ప్రఖ్యాతే 1981లో ఆయన పేరును గ్రామీ అవార్డుల నామినేషన్‌కు అర్హత సాధించిపెట్టింది. కేవలం పాశ్చాత్య ప్రపంచం నుంచే కాకుండా తూర్పు దేశాల నుంచి కూడా ఆయనకు అభినందనలు వెల్లువెత్తాయి. మద్రాసు (తమిళనాడు) గవర్నర్ ఆయనకు వయోలిన్ చక్రవర్తి (ఎంపరర్ ఆఫ్ వయోలిన్) బిరుదును ప్రదానం చేయగా, భారత ప్రభుత్వం 1988లో పద్మశ్రీ, 2001లో పద్మభూషణ్‌లతో సత్కరించింది.
అంజాద్ అలీ ఖాన్ : అంటే సరోద్. సరోద్ అంటే అంజద్ అలీ ఖాన్. అంతగా ఆయన పేరు సరోద్వాద్యంతో మమేకమైపోయి ప్రపంచ ప్రఖ్యాతి తెచ్చిపెట్టింది. సరోద్ వాయిద్యంగా కాక ఆయన చేతుల్లో ఓ పరిశోధనాత్మక పరికరంగా మారిపోతుంది. అంతే. దానితో ఆ వాద్యంలో కొత్త కొత్త సంగతులు పలుకుతాయి. మరో గొప్ప విశేషమేమంటే సరోద్ను ఆవిష్కరించిన బంగాశ్ వంశంలో ఈ సరోద్ విద్వాంసుడు ఆరోతరం వారు కావడం. ఆ కాలంలో గ్వాలియర్ సంస్థాన విద్వాంసుడిగా ఉండిన తన తండ్రి వద్దే ఈ మహామహుని సంగీత శిక్షణ సాగింది.
భారత ప్రభుత్వ విశిష్ట పురస్కారాలైన పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ బిరుదాంకితులు కావడమే కాకుండా, ప్రతిష్టాత్మక యునెస్కో అవార్డు, యునిసిఫ్ జాతీయ దౌత్యవేత్త గౌరవం, ప్రపంచ ఆర్థిక వేదిక ఇచ్చే క్రిస్టల్ అవార్డు ఖాన్‌సాబ్‌ను వరించాయి.
నైవేలి సంతానగోపాలన్ : కర్ణాటక సంగీతంలో తనకంటూ ఓ ప్రముఖ స్థానాన్ని సంపాదించుకొన్న మహా సంగీత విద్వాంసులు. గానంలో భక్తి రసాన్ని ఒలికించడంలో, భావాత్మకంగా ఆలపించడంలో ఆయనకు ఆయనే సాటి. సంగీత సామ్రాజ్యంలో సరికొత్త ప్రక్రియల కోసం అలుపెరుగని అన్వేషణ జరిపే సహజస్వభావానికి తోడు, ఈకళారంగంలోనే అత్యుత్తమ ప్రక్రియలను సొంతం చేసుకొనే ప్రత్యేక గుణమే ప్రపంచవ్యాప్తంగా గల సంగీత ప్రియుల మదిలో ఆయనకు ఎనలేని గౌరవాన్ని తెచ్చిపెట్టింది. అంతేకాదు. ఎన్నో దేవస్థానాలు ఆయనను తమ ఆస్థాన విద్వాంసుడిగా నియమించి గౌరవించాయి.
కైలాస్ ఖేర్ : ప్రఖ్యాత పాప్, ప్లేబ్యాక్ సింగర్. 2002లో ఈరంగంలో అడుగుపెట్టినప్పటి నుంచి భారత ఉపఖండ సంగీతప్రియుల మదిలో ఆయన ప్రముఖంగా చోటుసంపాదించుకొన్నారు. 'వైసాభీ హోతా హై' సినిమా 2వ భాగంలో ఆయన పాడిన "అల్లా కే బందే" పాట ఇప్పటికీ సంగీత ప్రియులు చెవికోసుకొనేంతగా పాపులరైంది. ఏఆర్ రెహ్మాన్ వంటి ప్రముఖులచే గుర్తింపు పొందిన కైలాస్ ఖేర్, సినీ పరిశ్రమలోని ప్రఖ్యాత నేపథ్యగాయకుల్లో ఒకరుగా గుర్తింపు పొందారు. ఇంతవరకు 50కిపైగా చిత్రాల్లో తననేపథ్యగానాన్ని అందించారు.
పురాతన సూఫీ సంగీత ఛాయల మధురిమ కైలాస్ ఖేర్ పాటల్లో బాగా గోచరిస్తుంది. స్వచ్ఛమైన ఆత్మభావన ఆయన పాటల్లో ప్రతిబింబిస్తుందనేది సంగీత అభిమానుల మాట.
కలోనియల్ కజిన్స్ : అంటే ప్రఖ్యాత గాయక స్వరకర్తలైన హరిహరన్ - లెస్లీ లెవిస్ల ద్వయం. గత రెండు దశాబ్దాలుగా సంగీత ప్రపంచంలో దీర్ఘకాల విజయపరంపరను స్వంతం చేసుకొన్న ఘనకీర్తి వీరిది. శాస్త్రీయ సంగీతంలో ఎంతో పేరుగడించిన హరిహరన్ ఎన్నో సినీగేయాలను ఆలపించారు. లెస్లీ స్వయంగా స్వరకర్త. గిటార్విద్వాంసుడు. ఆశాభోంస్లే, అలీషా చినాయ్లతో పనిచేసిన అనుభవం ఆయనది. ఈ సంగీతద్వయం సమ్మేళన సంగీతాన్ని (ఫ్యూజన్) అందించడంలో సిద్ధహస్తులు.
అటు పాశ్చాత్య, ఇటుశాస్త్రీయ సంగీతాల మేలి ఛాయలు వీరి గీతాల్లో వినవస్తాయి. 'కలోనియల్ కజన్స్' పేరిట 1996 అక్టోబర్‌లో ఈ జంట విడుదల చేసిన తొలి ఆల్బం వీరికి ఎంటీవీ ఆసియా వ్యూయర్స్ చాయిస్ అవార్డును, యూఎస్ 'బిల్‌బోర్డ్స్ వ్యూయర్స్' అవార్డును సాధించిపెట్టింది. ఈ ఆల్బం రికార్డులు బద్దలు కొట్టి పెద్ద హిట్టవడమే కాకుండా వీరికి ఆ ఆల్బంపేరే ప్రఖ్యాతమైంది. దీనితరువాత "వే వుయ్ డు ఇట్ విత్ యు", "ఆత్మా" అనే మరి రెండు ఆల్బంలను విడుదల చేశారు.
వసీపుద్దీన్ దగర్ : ద్రుపద్ ఘరానా హిందూస్థానీ సంగీతజ్ఞులు. పద్మశ్రీ అవార్డు గ్రహీత. తాన్సేన్ గురువు. మహామహులైన స్వామీ హరిదాస్ వంశానికి చెందినవారు. తన తండ్రి, పినతండ్రిల వద్ద సంగీత విద్యను అభ్యసించే అదృష్టం వీరికి దక్కింది. ఆ అదృష్టమే ఆ మహానుభావులిద్దరి శైలినీ దగర్ ఆ లాపనలో ప్రతిఫలింపజేస్తుంది.
వసీఫుద్దీన్ దగర్ ఎన్నో దేశాల్లో తన కచేరీలు చేశారు. వీటిలో ఫ్రాన్సులోని యునెస్కోలో, అలాగే 2001లో జరిగిన దలైలామా పవిత్ర సంగీత ప్రపంచ ఉత్సవంలో చేసిన కచేరీలు మరపురానివి.