మహాశివరాత్రి నాడు లింగోద్భవకాలమున శివుడిని స్తుతిస్తే..!?
శనివారం, 18 ఫిబ్రవరి 2012 (21:52 IST)
File
FILE
మనకు సాధారణంగా ప్రతినెల కృష్ణచతుర్దశి రోజున "శివరాత్రి" వస్తూనే ఉంటుంది. దానిని "మాసశివరాత్రి"గా భావించి శివానుగ్రహం పొందుటకు ఆ రోజు ఈశ్వరునకు విశేష పూజలు చేయిస్తూ ఉంటారు. అందులో అత్యంత విశిష్టమైనది, మాఘ బహుళ చతుర్దశినాడు వచ్చేది "మహాశివరాత్రి" పర్వదినం. ఇది శివపార్వతులకు ఎంతో ప్రీతికరమైనది.
ఇట్టి మహేశ్వరుడు నిర్గుణ నిరాకార పరబ్రహ్మ సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామియై ఈ చరాచర ప్రపంచం అంతట వ్యాపించి ఈ సహజ లక్షణాలతో ఆయన నిరాకారుడయ్యాడు. కాని భక్తులను అనుగ్రహించేందుకు, ఆశీర్వదించేందుకు, సుగుణాకార, నిర్గుణాకారాల ప్రతిరూపమే ఈ శివలింగ రూపమని, మిగిలిన దేవతలవలె "శిరము" మొదలైన ఇతర అవయవములు లేవు కాబట్టి! ఈ దేశదేవునకు లింగమే ప్రతీకగా, లింగపూజను నిరాకార ఆరాధనగా చేస్తూ ఉంటారని దైవజ్ఞులు చెబుతారు. ఇక ఈ "ఈశ్వరుడు" లింగోద్భవమూర్తిగా అవతరించుటకు గల కారణం ఏమిటో తెలుసుకుందాం.
దీనికి ఒకపురాణగాథ కలదు. ఒకసారి బ్రహ్మ, విష్ణు మూర్తుల మధ్య అహంకారం తలెత్తి అది చివరకు ఎవరెవరు ఎంతటి గొప్పవారో? తేల్చుకోవాలనే స్థితికి పోటీపడసాగినారు. వారిని గమనిస్తున్న పరమశివుడు వారికి కలిగిన అహంభావాన్ని అణగదొక్కి వారి ఇద్దరికీ చక్కని గుణపాఠం చెప్పాలనే ఉద్దేశ్యముతో "మాఘమాసం చతుర్దశినాడు" వారి ఇరువురకు మధ్య "జ్యోతిర్లింగంగా" రూపుదాల్చాడు.
వారు ఇరువురు ఆలింగం యొక్క ఆది అంతాలకు తెలుసుకోవాలని విష్ణుమూర్తి వరాహరూపందాల్చి జ్యోతిర్లింగం అడుగు భాగాన్ని వెతుకుతూవెళ్ళగా, బ్రహ్మదేవుడు హంసరూపందాల్చి ఆకాశం అంతా ఎగిరాడు. చివరకు కనుక్కోలేక ఓడిపోయి పరమేశ్వరుని శరణువేడుకుంటారు. అప్పుడు ఆ పరమశివుడు తన నిజరూపంతో దర్శనమిచ్చి అనుగ్రహించి వారి అహంకారాన్ని పోగొట్టినాడు. దానితో బ్రహ్మ విష్ణువులు పరమేశ్వరుని ఆధిక్యతను గుర్తించి వానికి విశేష పూజలతో సేవించి కీర్తించినారు. ఆ పర్వదినమే "మహాశివరాత్రి" అయ్యింది.
శివపద మణిమాలలో 'శి' అనగా శివుడనియు 'వ' అనగా శక్తి రూపమని చెప్పబడియున్నది. ఈ "శివరాత్రినాడు" విశేషమైన కాలం "లింగోద్భవకాలం" ఈ కాలం రాత్రి 11-30 నుండి ఒక గంట వరకు ఉంటుందట! ఆ సమయంలో నిర్మల మనస్సుతో శివపంచాక్షరీ జపిస్తూ ఉపవాస దీక్షతో "పార్థివ లింగానికి" పూజాభిషేకాలు చేసి మొదటి జాములో పాలతోను, రెండవజాములో పెరుగుతోను, మూడవ జామునందు నెయ్యితోను, నాల్గవ జామునందు తేనెతోను అర్చించిన ఉమాశంకరులకు అత్యంత ప్రీతికరమని, ఆలాగునే! లక్షబిల్వార్చన ఆచరించినవార్కి విశేష పుణ్యఫలం సిద్ధిస్తుంది.
శివునిచే విసర్జించబడిన "మొగలిపూవులతో" శివారాధన కనుక చేస్తే ఆ రోజు విష్ణుమూర్తి ప్రీతికొరకై స్వీకరించి వార్కి సహస్రాశ్వమేధ ఫలము లభించి శివసాయుజ్యము లభిస్తుందని పండిత శ్రేష్టులు "శివరాత్రి మహాత్మ్యం" గురించి వివరిస్తూ ఉంటారు. ఇంతటి విశిష్టమైన "మహాశివరాత్రి" పుణ్యదినం రోజున సమీప శివక్షేత్రాలలో విశేషార్చనలు జరిపించుకుని మనమంతా పునీతులౌదాము.