మహాశివరాత్రి రోజున ఎర్రటి ప్రమిదలతో దీపమెలిగిస్తే..!?
FILE
శివాయ గౌరీ వదనాబ్జ భృంగ సూర్యాయ దక్షాధ్వర నాశకాయ శ్రీ నీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శ్రీకారాయ నమశ్శివాయ || అంటూ ముక్కంటిని స్తుతిస్తూ మహాశివరాత్రి రోజున ఎర్రటి ప్రమిదలతో దీపమెలిగిస్తే కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. మహేశ్వరుడిని మహాశివరాత్రి రోజున లింగోద్భవమూర్తిగా ఉన్న ముక్కంటిని పూజిస్తే సకలసంపదలు చేకూరుతాయి.
అందుచేత మహాశివరాత్రి రోజున సూర్యోదయానికి ముందే లేచి, తలస్నానము చేయాలి. అటుపిమ్మట పూజామందిరము, ఇంటిని శుభ్రం చేసుకుని, గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజా మందిరములో ముగ్గులు, పుష్పాలతో అలంకరించుకోవాలి. ఈ రోజున తెల్లటి దుస్తులు ధరించడం మంచిది.
పూజకు శివుని ఫోటోగానీ లేదా, లింగాకారముతో గల విగ్రహాన్ని సిద్ధం చేసుకోవాలి. అలాగే మారేడు దళములు, తెల్లపూలమాల, నైవేద్యానికి పొంగలి, బూరెలు ప్లస్ గారెల్, అరటి ప్లస్ జామకాయలు సమర్పించుకోవచ్చు.
పూజకు ముందుశివఅష్టోత్తరము, దారిద్ర్యదహన స్తోత్రము, శివారాధన, శివపురాణము, లింగోద్భవ అధ్యాయము వంటివి పారాయణము చేయడం ద్వారా శుభఫలితాలుంటాయి. ఇంకా శివరాత్రి రోజున శ్రీశైలం, శ్రీకాళహస్తి, ద్రాక్షారామం వంటి ఆలయాలను దర్శించడం ద్వారా ఆర్థికాభివృద్ధి, వ్యాపారాభివృద్ధి కలుగుతుంది.
ఇంకా శివరాత్రిరోజున ఆలయంలో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, ఏకాదశ రుద్రాభిషేకం, 108 బిందెలతో రుద్రాభిషేకం, శివకళ్యాణము వంటివి నిర్వహించడం శుభఫలితాలిస్తాయని పురోహితులు చెబుతున్నారు.
మహాశివరాత్రి రోజు సాయంత్రం ఆరు గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఆరు వరకు పూజ చేసుకోవచ్చు. దీపారాధనకు నువ్వులనూనె, ఐదు వత్తులు ఉపయోగించాలి. పంచహారతి ఇవ్వడం మంచిది. అలాగే ఇంటికి వచ్చిన ముత్తైదువులకు శివభక్తిమాల, శివకళ్యాణము వంటి పుస్తకాలను తాంబూలముతో కలిపి ఇవ్వాలని పురోహితులు చెబుతున్నారు.