సకల శుభ స్వరూపుడైన పరమశివుడు నిరాకార రూపుడు, జ్యోతిర్లింగ రూపంలో వెలసి సృష్టికి శ్రీకారం చుట్టిన పరమేశ్వరుడు , అవసరమైనప్పుడు సాకార రూపంలో భక్తులను కరుణిస్తూ ఉంటాడు.
శివుని జటాజూటంతో ఉన్న గంగ అమృతత్త్వానికి, శుద్ధ బ్రహ్మజ్ఞానానికి చిహ్నం, జటాజూటానికి క్రిందివైపు అర్థ చంద్రుడు జ్ఞానపుష్టికి ప్రతీక. గజచర్మాన్ని ధరించిన స్వామివారు, దానిపై పులి చర్మాన్ని నడుముకు చుట్టుకుంటాడు. పులిచర్మం దుష్టశిక్షణను, ఏనుగుచర్మం స్వామి కరుణను సూచిస్తుంటాయి.
నాగాభరణుడైన భక్తసులభుడు త్రిశూలం, మృగం, డమరుకం పట్టుకుని, కపాల, ఉసిరికాయ మాలలను ధరించి నందివాహనంపై సాక్షాత్కరిస్తుంటాడు. దుష్టశిక్షణకు త్రిశూలం, శిష్ట రక్షణకు మృగాన్ని (లేడి) పట్టుకున్న స్వామివారు కంఠంలో ధరించిన పాము నవగ్రహాలలో సూర్యుడు మినహా, మిగతా 8 గ్రహాల పరిభ్రమణానికి సంకేతమని పండితులు అంటున్నారు.