భారతీయ సంస్కృతిలోని విభన్నతే అంతర్లీనంగా దాని ఏకత్వాన్ని అనుసంధిస్తున్న సూత్రం. వేలాది సంవత్సరాల కాలగమనంలో రూపుదిద్దుకొంటూ వచ్చిన వివిధ కళారూపాలు దేశంలోని విభిన్నసంస్కృతుల ప్రతిబింబాలే కాదు, ఆధ్యాత్మిక ప్రేరకాలు కూడా. ఇవన్నీ ఈ దేశాన్ని వేలాది సంవత్సరాలుగా సుసంపన్నం చేస్తూ వచ్చాయి. అయితే, ఇప్పటి మన జీవిత ఉరవడిలో అతిశీఘ్రంగా కనుమరుగై మన స్తృతిపథం నుంచి మాయమవుతున్నాయి.
అందుకే దేశంలోని ఈ కళారూపాల అద్వితీయతను, స్వచ్ఛతను, విభిన్నత్వాన్ని పరికక్షించుకొంటూ మరింత సుసంపన్నం చేసే ప్రయత్నంలో ఈశా ఫౌండేషన్ ఏటేటా సంగీత, నృత్యోత్సవాలసప్తాహం యక్షను వెల్లియంగిరి పర్వతపాద సమీపంలో హరిత ప్రకృతి సహజసుందర సోయగాల మధ్య వెలసిన పవిత్ర ధ్యానలింగ యోగాలయ (ధ్యానలింగ గుడి) ఆవరణలో నిర్వహిస్తోంది. భారత పురాణాల్లోని దేవతా సమూహాల్లో ఒకరైన, కళా దేవతలైన, 'యక్షు'ల పేరును ఈ ఉత్సవాలకు పెట్టడమైనది. ఆచార్యులు, ఉద్దండులు, నిష్టాతులు, అలాగే ఔత్సాహికులు కళాకారులు తమ విద్యను ప్రదర్శించడానికి, వారి కళలను ప్రేక్షకులు వీక్షించి ఆనందించి అభినందించడానికి యక్ష ఓ వేదికగా ఉపకరిస్తుంది.
ఈ ప్రదర్శనలన్నీ ఈషా కేంద్రంలోని శ్రీలింగభైరవి, ధ్యానలింగ ఆలయాల ప్రాంగణంలో జరుగుతాయి. భావనా తరంగా సాగరంలో ప్రేక్షకశ్రోతలను ముంచెత్తే ఈ ప్రదర్శనా కళారూపాలన్నీ భారతీయ ప్రాచీన సంస్కృతిలో అందర్భూతంగా ఎంతో నిగూఢంగా నిక్షిప్తమై ఉన్న గంభీరత, సంపన్నతలను ఆవిష్కరించి, తద్వారా ఈ కళారూపాల సౌందర్యాన్ని మరల అందుకోగలిగే అపూర్వ మహదవకాశాన్ని ప్రపంచ ప్రజానీకానికి ఇస్తాయి.
శోభాయమానమైన ఈ మహాసాంస్కృతికోత్సవం ఈ 2012 ఫిబ్రవరి నెల 13వతేదీ నుంచి 19న తేదీ వరకు జరుగుతుంది. భారతదేశంలోని మహా ఉద్దండులైన కళాకారులచే వరుసగా ఈ ఏడురాత్రుల్లోనూ సంగీత కచేరీలు, నృత్య ప్రదర్శనలూ ఉంటాయి. ప్రతిరోజూ సాంస్కృతిక, సమకాలీన కళారూపాల సమ్మేళనం అలరిస్తుంది. కర్ణాటక, హిందూస్థానీ సంగీత ప్రక్రియల్లో నిష్టాతులైన గాయకులు, వేణు, తబలా, సరోద్ వంటి వాయిద్య విద్వాంసుల కచేరీలు, భరతనాట్యం వంటి శాస్త్రీయ నృత్యాలతో పాటు, యావత్ ప్రపంచంలోని మేటిజానపద కళాకారుల ప్రదర్శనలు ప్రేక్షకశ్రోతలను ఆనందపరవశులను చేస్తాయి.
ఈ 2012 యక్ష ఉత్సవాల్లో పద్మశ్రీ, పద్రభూషణ్, పద్మవిభూషణ్ బిరుదాంకితులైన సరోద్ విద్వాంసుడు అంజద్ అలీఖాన్, వయోలిన్ విద్వాంసుడు పద్మశ్రీ, పద్మభూషణ్ ఎల్. సుబ్రమణియమ్, భరతనాట్య విదుషీమణి పద్మశ్రీ, పద్మభూషణ్ అలర్మేల్ వల్లి, కర్ణాటక సంగీత విద్వాంసుడు రవికిరణ్, ప్రఖ్యాత భారతీయ శాస్త్రీయ సంగీత గాయకుడు నెయవెలి సంతానగోపాలన్, జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత పద్మశ్రీ సుభా ముద్గల్, పద్మభూషణ్ చన్నూలాల్ మిశ్రా వంటి ఉద్దండ కళాకారులు పాల్గొంటారు.
జాగరణ మహోత్సవంగా భారత ప్రజానీకం ఏటేటా భక్తిప్రపత్తులతో జరుపుకొనే మహాశివరాత్రి పర్వదినంతో ఈ యక్ష ఉత్సవాలు సంపన్నమవుతాయి. ఏడాదిమొత్తానికే అతి చిమ్మచీకటి రాత్రి అయిన ఈ మహాశివరాత్రి, పరమశివుని కరుణాకటాక్షాల నిలయం. అసలు యోగసంప్రదాయానికి పరమ శివుడే ఆదిగురువు లేదా మొట్టమొదటి గురువు (గా ఆరాధింపబడుతున్నారంటే ఆ పరమేశ్వరుని విభూతియోగమెంత ఉత్కృష్టమైనదో అర్థమవుతుంది). ఈ పరమ పవిత్రమైన రాత్రి గ్రహగతుల ప్రభావం కారణంగా యావత్ మానవశరీర నిర్మాణ వ్యవస్థలో శక్తి ఊర్థ్వ చలనం అతిసహజంగా చోటు చేసుకొంటుంది. అందువల్ల ఈరాత్రి యావత్తూ నిద్రపోకుండా మేలుకొని నిటారుగా కూచుని ఉండడం వల్ల వ్యక్తి భౌతిక, ఆధ్మాత్మికోన్నతికి దోహదపడుతుంది. అంతేకాదు. ఈ జాగరణ, భౌతిక, ఆంతరంగిక సానుకూల పరిణామాలను కలిగించి ఆ వ్యక్తికి స్వాస్థ్యజీవనం ప్రసాదిస్తుంది. వీటన్నిటికీ మించి ఈ రోజురాత్రి ఆచరించే ఏ యోగాచరణైనా ఎన్నోరెట్లు ఫలితాన్నిస్తుంది. అందుకే మహాశివరాత్రినాటి రాత్రిభాగంలో అసలు నిద్రేపోరాదని యోగసాంప్రదాయం నిర్దేశిస్తోంది.
అటువంటి ఈ మహాశివరాత్రి ఈషా యోగ కేంద్రంలో ప్రతి ఏటా మహోత్సాహంతో, ఆధ్యాత్మికోధృతితో నిర్వహించబడుతుంది. ప్రపంచం నలుమూలల నుండీ ఇక్కడికి తరలివచ్చే ఎనిమిది లక్షల మందికిపైగా ప్రజానీకం సద్గురు సన్నిధిలో రాత్రంతా సాగే సత్సంగంలో పాల్గొంటారు. ఈ పవిత్ర సమయంలో సద్గురు ప్రబోధాలు, ప్రవచనాలు, శక్తివంతమైన ధ్యానాలు, మధ్య మధ్య విశ్వవిఖ్యాతులైన విద్వాంసుల సంగీత కచేరీలు అన్నీ కలిసి ఓ గొప్పఆధ్యాత్మిక అనుభవాన్ని అందిస్తాయి. ఈ ఏడాది మహాశివరాత్రి 2010 ఫిబ్రవరి 20వ తేదీన వస్తోంది. సద్గురువు నిర్వహించే పంచభూత ఆరాధనతో ఆనాటి ఆధ్యాత్మికకార్యక్రమాలు సాయంత్రం గం.5.40లకు ప్రారంభవుతాయి.
పంచభూతాత్మకమైన ఈ శరీరాన్ని (శరీరంలోని పంచభూతాల అంశలనూ) శుద్ధి చేసే ఈ అసాధారణ ప్రక్రియ వల్ల ఆరోగ్యం, తద్వారా సుఖజీవనం సంప్రాప్తిస్తాయి. అనంతరం ధ్యానలింగ యోగాలయంలో ఆధ్యాత్మిక పరమగురువులందరకూ గురుపూజ జరుగుతుంది. తరువాత ఉత్సవాలమైదానంలో ఈషా బ్రహ్మచారులు ఆలపించే నిర్వాణశతక పారాయణతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ నిర్వాణ శతకాన్ని ఆదిశంకరాచార్యులవారు వేయిసంవత్సరాల కిందటే ప్రవచించారు. అనంతరం, సద్గురు స్వయంగా అనేక ఆధ్యాత్మిక ప్రక్రియలు నిర్వహిస్తారు.
సరిగ్గా లింగోద్భకాలంలో అంటే అర్ధరాత్రి కాగానే.. సద్గురువు అక్కడ చేరిన అసంఖ్యాక మహాజన సమూహంచే మహాశక్తివంతమైన ధ్యానం ఆచరింపజేస్తారు. ఈ మహాపవిత్రమైన శివరాత్రి కాలంలో ఈషా స్వచ్ఛంద కార్యకర్తలచే అన్నదానం జరుగుతుంది. తరువాత సద్గురువు ఆచరించే ధ్యానంతో మరునాడు ఉదయం గం.6.00ల సమయానికి ఉత్సవాలు పరిసమాప్తి అవుతాయి.
రాత్రంతాసాగే ఈ ఉత్సవాల సందర్భంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన విద్వాంసుల సంగీత కచేరీలు, మధ్య రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు అలరిస్తాయి. ముఖ్యంగా ప్రఖ్యాత కలోనియల్ కజిన్స్, పద్మశ్రీ హరిహరన్, లెస్లీ లెవిస్ల ప్రదర్శన, ప్రఖ్యాత పాప్‌స్టార్ కైలాస్‌ఖేర్, శాస్త్రీయ ద్రుపద్ఘరానా మేటి గాయకుడు పద్మశ్రీ వసీఫుద్దీన్ దగర్ కచేరీలు వీటిలో ప్రధానమైనవి.
ఈ మహాశివరాత్రి మహోత్సవాల్లో పాల్గొనాలని ఎంతో ఆశపడుతున్నా, ఈశా యోగా కేంద్రానికి తరలిరాలేని అసంఖ్యాక అభిమానుల సౌకర్యార్థం ఆస్తా చానెల్లో ఈ ఉత్సవాలు మొత్తం ప్రత్యక్షంగా ప్రసారమవుతాయి. ఈశా ఫౌండేషన్ కూడా ఈ ఉత్సవాలను అప్పటికప్పుడు (లైవ్‌గా), ఆ తరువాత కూడా ప్రసారం చేస్తుంది. ఈ మహాశివరాత్రి ఉత్సవాలు ఈషా సంస్థకు చెందిన ప్రపంచంలోని 150 కేంద్రాల్లోనూ నిర్వహిస్తారు.
అక్కడికి చేరడం...
ధ్యానలింగ యోగాలయం కోయంబత్తూరు నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న వెల్లియాంగిరి పర్వతసానువుల్లో గల ఈశా యోగా కేంద్రంలో నెలకొని ఉంది. దక్షిణ భారత దేశంలో ప్రధాన పారిశ్రామిక పట్టణమైన కోయంబత్తూరుకు రోడ్డు, రైలు, విమానాల ద్వారా చేరుకొనే సౌకర్యం ఉంది.
విమాన ప్రయాణం : కోయంబత్తూరులోనే విమానాశ్రయం ఉంది. ఢిల్లీ, చెన్నై, ముంబై, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల నుంచి రెగ్యులర్ సర్వీసులున్నాయి.
రైలు : సమీప రైల్వే స్టేషన్ కోయంబత్తూరు. ఇది ఈశా యోగకేంద్రం నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది.
రోడ్డు : పూండి, సెమ్మేడు, లేదా శిరువాణికి వెళ్లే ప్రధాన రహదారులన్నీ ఈశా యోగ కేంద్రానికి దారి తీస్తాయి. రైల్వేస్టేషన్, విమానాశ్రయాల నుంచి టాక్సీ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది.