ఓంకార స్వరూపుడైన శివుడు నాలుగు యుగాలు, వేదాలుగా ఉంటూ యజ్ఞాన్ని ప్రవర్తింపజేస్తుంటాడు. అంతేకాకుండా, అనంతరూపుడైన శివపరమాత్మ అవసరమైనపుడు అవతరాలను ధరిస్తుంటాడు. అలా ఐదు కల్పాలలో బ్రహ్మదేవునికి జ్ఞానబోధ చేయడానికై ఐదు రూపాలను ధరించాడు. ఆ రూపాలే సద్యోజాత, వాసుదేవ, అగోర, ఈసాన, తత్పురుష రూపాలు. ఈ రూపాల గురించి ఇపుడు తెలుసుకుందాం.
సద్యోజాత రూపం.. శ్వేతలోహితమనే కల్పంలో పరమేశ్వరుని ధ్యానించిన చతుర్ముఖుడు తనకు జ్ఞానాన్ని ప్రసాదించమంటూ వేడుకున్నాడు. అపుడు సద్యోజాత రూపంలో ప్రత్యక్షమైన శివుడు, బ్రహ్మకు జ్ఞానాన్ని ప్రసాదించడంతో పాటు ఆయన కోరిక మేరకు సునందుడు, నందుడు, విశ్వ నందుడు, ఉపనందుడు అనే నలుగురు కుమారులను ప్రసాదించాడు. వారితో బ్రహ్మ, సృష్టిని ప్రారంభించినట్టు పురాణాలు చెపుతున్నాయి.
వామదేవ రూపం.. రక్త కల్పంలో మరలా జ్ఞాన ప్రసాదం కావాలంటూ బ్రహ్మదేవుడు, శివుని ప్రార్థించగా, ఎరుపురంగు శరీర ఛాయతో, ఎర్రటి వస్త్రాలను, ఎర్రటి ఆభరణాలను ధరించి, ఎర్రటి కళ్ళతో వామదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన మహిమ ద్వారా విరజసుడు, వినాహుడు, విశోకుడు, విశ్వభానుడు అనే వారు ఉద్భవించారు. వారు కూడా ఎర్రటిరంగు వస్త్రాలనే ధరించారు. అనంతరం బ్రహ్మదేవునికి కావలసిన జ్ఞానాన్ని శివుడు ప్రసాదించాడు.
తత్పురుష రూపం, అఘోర రూపం, ఈశానరూపాల గురించి రేపు తెలుసుకుందాం.