క్వీన్ ఆఫ్ హిల్ స్టేషన్, నీలగిరి కా రాణి "ఊటీ"

FILE
తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి పర్వతాలపై నెలకొని ఉన్న ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం "ఊటీ". దీని అధికారిక నామం "ఉదక మండలం" కాగా, "క్వీన్ ఆఫ్ హిల్‌స్టేషన్‌"గా పేరుగాంచింది. సముద్ర మట్టానికి 2,240 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రదేశం ఎల్లప్పుడూ చల్లగా ఉంటుంది. అందుకే మంచి వేసవి విడిది కేంద్రంగా ప్రసిద్ధిగాంచిన ఈ ప్రదేశంలో సేదదీరేందుకు దేశ విదేశాల నుంచి పర్యాటకులు రెక్కలుగట్టుకుని వాలిపోతుంటారు.

ఊటీ చరిత్రను చూస్తే.. పూర్వకాలంలో నీలగిరి పర్వతాలు చేర సామ్రాజ్యంలో భాగంగా ఉండేవి. ఆ తరువాత గంగరాజులు, 12వ శతాబ్దంలో హొయసాలల వంశ రాజైన విష్ణువర్ధనుడి సామ్రాజ్యాలలో భాగమయ్యాయి. చివరగా టిప్పు సుల్తాన్ ఆధీనంలోకి ఆ తరువాత 18వ శతాబ్దంలో తెల్లవారి సామ్రాజ్యంలో భాగంగా ఉన్నాయి.

ఆంగ్లేయుల కాలంలోనే కోయంబత్తూర్ ప్రావిన్స్ గవర్నర్‌గా పనిచేసిన జాన్ సుల్లివాన్ నీలగిరి పర్వత శ్రేణుల్లో కొలువైయున్న ఊటీ చల్లటి వాతావరణం, అక్కడి వన సౌందర్యానికి ముగ్ధుడయ్యాడు. వెంటనే ఊటీ ప్రాంతంలో అప్పట్లో నివసిస్తున్న కోయజాతి ప్రజలకు అతి తక్కువ పైకం ముట్టజెప్పి ఆ ప్రాంతాన్ని కొనుగోలు చేశాడు. అలా ఊటీ ప్రాంతంలోని స్థలాలన్నీ మెల్లిమెల్లిగా ఆంగ్లేయులపరం కావటంతో చాలా వేగంగా అభివృద్ధి చెందడం ప్రారంభమైంది.

ఆ తరువాత మద్రాసు సంస్థానానికి ఊటీ వేసవి రాజధానిగా మారింది. మద్రాసు సంస్థానం సహకారంతో ఊటీలో ప్రముఖ ఆంగ్లేయులు కొండల మధ్య మెలికలు తిరిగే రహదారులు, సంక్లిష్టమైన రైలు మార్గాల్ని నిర్మించారు. ఎటు చూసిన కనిపించే పచ్చదనం, ముచ్చటగొలిపే లోయల సౌందర్యానికి ముగ్ధులైన ఆంగ్లేయులు దీన్ని "క్వీన్ ఆఫ్ హిల్స్" అంటూ ముద్దుగా పిలుచుకునేవారు.

ఊటీలో దర్శనీయ ప్రదేశాలు అనేకం ఉన్నాయి. వాటిలో బొటానికల్ గార్డెన్, లేక్, గవర్నమెంట్ మ్యూజియం, దొడ్డబెట్ట శిఖరం, ఊటీ బోట్‌హౌస్, కాఫీ తోటలు హిందూ దేవాలయాలైన మురుగన్ కోయిల్, వెంకటేశ్వర స్వామి, మరియమ్మ, సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాలు ముఖ్యమైనవి. ఊటీ సమ్మర్ ఫెస్టివల్‍‌కు పెట్టింది పేరు. అలాగే మే నెలలో ఫ్లవర్ షో, ఫ్రూట్ షో పర్యాటకులను కట్టిపడేస్తాయి.

ఊటీ పరిసర ప్రాంతాలలో కెట్టివాలి వ్యూ, పైకరా, అప్పర్ భవాని, అవలంచి, జయలలిత వైల్డ్ లైఫ్ శాంక్చురీ, దొడ్డబెట్ట, కల్హట్టి ఫాల్స్, వెన్‌బాక్‌ డాన్స్‌, వెక్‌ హిల్స్‌, స్నోడెన్‌ పీక్‌, కూనూరు, డాల్ఫిన్స్‌ నోస్‌, లాంబ్స్‌ రాక్‌, లాన్‌ ఫాల్స్‌, సెయింట్‌ కేధరిన్‌ ఫాల్స్‌, సిమ్స్‌ పార్క్‌, సిమ్స్‌ పార్క్‌, కోటగిరి, కొడనాడ్‌ పాయింట్ తదితరాలు మరికొన్ని చూడదగ్గ ప్రదేశాలు.

FILE
"బొటానికల్ గార్డెన్" గురించి చెప్పుకోవాలంటే.. ఇది ఊటీ స్టేషన్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది 1847లో మార్క్విస్ చేత ప్రారంభించబడింది. అద్భుతమైన పూల మొక్కలు, అరుదైన పుష్ప జాతులను ఇక్కడ చూడవచ్చు. మే నెలలో ఇక్కడ ఫ్లవర్ షో జరుగుతుంది. ఈ బొటానికల్ గార్డెన్లో 20 మిలియన్ల సంవత్సరాల క్రితం నాటి ఫాసిల్ చెట్టు తప్పకుండా దర్శించాల్సిందే.

అలాగే ఊటీకి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉండే "లేక్" చూడదగ్గది. ఇది 1824లో కోయంబత్తూర్ కలెక్టర్ జాన్ సిలివాస్ చేత నిర్మించబడింది. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 దాకా ఈ లేక్‌లో ఎంచక్కా బోటింగ్ చేయవచ్చు. ఇక్కడ చిన్నారుల కోసం చిల్డ్రన్స్ కార్నర్ కూడా ఉంది. ఆ తరువాత చెప్పుకోవాల్సింది గవర్నమెంట్ మ్యూజియం. మైసూర్ రోడ్డులో ఉన్న ఈ మ్యూజియంలో పాతకాలంనాటి అనేక వస్తువులను చూడవచ్చు.

ఊటీ పరిసర ప్రాంతంలో ఉన్న "కెట్టివ్యాలి వ్యూ" తప్పకుండా చూడాల్సిందే. ఇది కూనూరు వెళ్లే దారిలో ఉంది. కోయంబత్తూర్, మైసూర్ మైదానాలలో ఉండే చిన్న గ్రామాలన్నింటినీ చూడవచ్చు. ఆ తరువాత ఊటీకి 21 కిలోమీటర్ల దూరంలో ఉన్న "పైకరా" చూడాల్సిన మరో ప్రదేశం. ఇది మైసూర్ రోడ్లో ఉంది. ఇక్కడ రిజర్వాయర్, డ్యామ్ చూడదగ్గవి.

లాగే "అప్పర్ భవాని" అనే ప్రదేశం కూడా చూడదగ్గదే. ఇది కోరాకుందా నుంచి 10 కిలోమీటర్ల దూరంలో, అవలంచి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ నిశ్శబ్దలోయ చూడదగ్గది. ఊటికి 28 కిలోమీటర్ల దూరంలోని "అవలంచి" చూడదగ్గ మరో ప్రదేశం. ఇక్కడ సుందరమైన సరస్సు, చుట్టూ అడవితో పర్యాటకులకు స్వర్గాన్ని తలపిస్తుంది.

అలాగే నీలగిరిలో ఉన్న ఎత్తైన శిఖరం దొడ్డబెట్ట, అక్కడ నెలవైన టెలిస్కోపుతో నీలగిరి అందాల వీక్షణ పర్యాటకులకు మరపురాని అనుభూతిని మిగుల్చుతుంది. ఇంకా జయలలిత వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఏనుగులు, పులులు, జింకలు, నీటి పక్షులు, కొండ చిలువలను చూడవచ్చు. టేకు చెట్లు అధికంగా ఉండే ఈ శాంక్చురీకి దగ్గర్లోని మోయర్ జలపాతం, ముఖ్యమంత్రి గడియార స్తంభం చూడదగ్గవి.

ఇక చివరిగా.. చలికాలంలో 21 డిగ్రీల సెంటీగ్రేడ్, వేసవిలో 25 డిగ్రీల సెంటీగ్రేడ్‌లలో ఊటీ ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఏప్రిల్, జూన్, సెప్టెంబర్, నవంబర్ నెలలు ఊటీ సందర్శనకు అనుకూలమైన నెలలు. కోయంబత్తూరు నుంచి రైల్లో ఊటికి చేరుకోవచ్చు. చెన్నై నుంచి కూడా ఊటీకి నేరుగా రైలు సౌకర్యం ఉంది. అదే విధంగా తమిళనాడు రాష్ట్రంలోని అనేక ప్రదేశాల నుంచి పలు రోడ్డు మార్గాలలో ఊటీ చేరుకోవచ్చు.

వెబ్దునియా పై చదవండి