సమ్మర్ బ్యూటీ అండ్ కూల్ స్పాట్ "కొడైకెనాల్"

FILE
వేసవిలో ఎండతాపాన్ని చల్లార్చుకునేందుకు చల్లగా ఉండే ప్రదేశాలను వెతుక్కుని మరీ వాలిపోయే ప్రకృతి ప్రేమికులకు అచ్చమైన దేశీయ కూల్ స్పాట్ "కొడైకెనాల్". పర్యాటకులంతా "ప్రిన్స్ ఆఫ్ హిల్‌స్టేషన్‌" అంటూ ముద్దుగా పిలుచుకునే ఈ ప్రదేశం దక్షిణ భారతదేశంలోని చెన్నై నగరానికి 600 కిలోమీటర్ల దూరంలో ఉంది. పళని కొండల శ్రేణిలో సముద్ర మట్టంనుంచి 2,130 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రదేశంలోని లోయలు, పర్వతాలు, పూల తోటలు, జలపాతాలు, సరస్సులు వీక్షకులకు కనువిందు కలిగిస్తాయి.

వేసవిలో గరిష్టంగా 20 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 11 డిగ్రీల సెల్సియస్‌గా ఉష్ణోగ్రతలు నమోదయ్యే కొడైకెనాల్‌లో చూడదగ్గ ప్రదేశాలు అనేకం ఉన్నాయి. అలాంటి వాటిలో కొడై సరస్సు, కొడై సరస్సు కోకర్స్ వాక్, సెయింట్ మేరీ చర్చ్, పంపార్ జలపాతం, గ్రీన్ వ్యాలీ వ్యూ, గుణ గుహ, ఫైన్ వృక్ష్యారణ్యం, శాంతి లోయ, కురుంజి ఆండవర్ ఆలయం.. తదితర ప్రదేశాలు ముఖ్యంగా చూడదగ్గవి.

మానవ నిర్మితమైన "కొడై సరస్సు" కొడైకెనాల్ పట్టణం సెంటర్‌కు దగ్గర్లో ఉంది. దీనిని 1863లో నిర్మించారు. 60 హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించిన ఈ సరస్సు ఓవైపు అరచేతిమాదిరిగా వెడల్పుగా ఉండి, మరోవైపు చేతివేళ్లలాగా సన్నటి పాయలుగా ఉంటుంది. ఇందులో బోటు షికారు చేసేందుకు పర్యాటకులు చాలా ఆసక్తి చూపిస్తుంటారు.

ఒక కొండ అంచున సన్నగా పొడుగ్గా ఉండే కాలిబాట, ఆ బాట వెంబడే నడుచుకుంటూ వెళితే చుట్టూ కనిపించే ప్రకృతి దృశ్యాల సమ్మేళనమే "కొడై సరస్సు కోకర్స్ వాక్" ప్రదేశం. దీని తరువాత సుమారు 150 సంవత్సరాల క్రితం ఈ ప్రదేశంలో నిర్మించిన మొట్టమొదటి చర్చి "సెయింట్ మేరీ చర్చి" చూడదగ్గది. చర్చి నిర్మాణంలోని నగిషీ పని వీక్షకులను విశేషంగా ఆకట్టుకునేలా ఉంటుంది.

కొడైకెనాల్ పట్టణానికి చివర్లో ఉండే "పంపార్ జలపాతం" పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే మరో ప్రదేశం. ఇది ఎత్తుపల్లాలతో ఉండే రాతినేలమీద ప్రవహిస్తూ వచ్చే ఓ సన్నిటి వాగు మాత్రమే. ఆ తరువాత ఓ కొండ అంచున నిలబడి చూసేందుకు వీలుగా నిర్మించిన "గ్రీన్ వ్యాలీ వ్యూ" చూడదగ్గది. ఇక్కడినుంచి చూస్తే విశాలమైన లోయ, పచ్చని చెట్లతో కూడిన పర్వతాలు ప్రకృతి ప్రేమికులను పరవశింపజేస్తాయి.

ఆ తరువాత చెప్పుకోవాల్సింది "గుణ గుహ". రోడ్డు అంచున ఉన్న ఓ బాట వెంబడి సుమారు 200 గజాలు గుబురుగా ఉండే చెట్ల మధ్యలో నుంచి కిందికి దిగుతూ వెళితే, ఓ చిన్న కొండ అడుగుభాగంలో ఈ గుహ దర్శనమిస్తుంది. అయితే దీనికి దగ్గరగా వెళ్లి చూడటం మాత్రం వీలుపడదు. ఎందుకంటే అక్కడికి వెళ్లే వీలు లేకుండా చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. స్థానికులు దీనినే "దెయ్యాల గుహ" అని కూడా పిలుస్తుంటారు.

FILE
"ఫైన్ వృక్షాల అరణ్యం" కొడైకెనాల్‌లో చూడదగ్గ మరో ముఖ్య ప్రదేశం. కేవలం మంచు, చలి అధికంగా ఉండే కొండ ప్రాంతాలలో పెరిగే ఈ వృక్షాలు ఓ కిలోమీటర్ విస్తీర్ణంలో దట్టంగా పెరిగి.. పర్యాటకులను కొత్తలోకంలోకి తీసుకెళ్తాయి. దీని తరువాత దట్టమైన చెట్లతో నిండి ఉండే విశాలమైన "శాంతి లోయ" కూడా చూడదగ్గదే.

ఇక చివరిగా చెప్పుకోవాల్సింది "కురుంజి ఆండవర్ ఆలయం" గురించే. కొడైకెనాల్‌కు కాస్త దూరంగా ఉండే ఈ ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కొలువైయున్నాడు. ఒకానొక కాలంలో ఇక్కడ నివసించిన ఓ యూరోపియన్ మహిళకు స్వామివారు కలలో దర్శనమిచ్చి ఆశీర్వదించారట. అందుకు కృతజ్ఞతగా ఆమె ఈ కురుంజి ఆండవర్ ఆలయాన్ని నిర్మించినట్లు స్థానికులు చెబుతుంటారు. మరో కథనం ప్రకారం చూస్తే.. కొడైకెనాల్ పరిసర ప్రాంతాలలో 12 సంవత్సరాలకు (పుష్కరం) ఒకసారి మాత్రమే పూసే "కురుంజి" పుష్పాల వల్లనే ఈ ఆలయానికి ఆ పేరు వచ్చినట్లు తెలుస్తోంది.

కొడైకెనాల్ ఎలా వెళ్లాలంటే.. విమానం, రైలు, రోడ్డు మార్గాలలో చేరుకోవచ్చు. తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై నుంచి విమానం ద్వారా మధురై, కోయంబత్తూర్, తిరుచురాపల్లి తదితర ప్రాంతాలకు చేరుకుని.. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా చేరుకోవచ్చు. రైలు ప్రయాణమైతే చెన్నై నుంచి నేరుగా కొడైకెనాల్ రోడ్డు స్టేషన్ చేరుకుని, అక్కడినుంచి ఘాట్ మార్గంలో కొడైకెనాల్ పట్టణానికి చేరుకోవచ్చు.

కొడైకెనాల్‌కు దక్షిణంగా 120 కి.మీ దూరంలో మధురై, పడమర దిశగా 64 కి.మీ దూరంలో పళని, ఉత్తర దిశగా 99 కి.మీ.దూరంలో దిండిగల్‌లు ఉన్నాయి. కొండ ప్రాంతం కాబట్టి ఘాట్ రోడ్డులో ప్రయాణించేవారు మధురై నుండి సుమారు నాలుగు గంటలు, పళని నుండి రెండు గంటలు, దిండిగల్ నుండి మూడున్నర గంటల బస్సు లేదా ఇతర ప్రైవేటు వాహనాలలో ప్రయాణించి కొడైకెనాల్ చేరుకోవచ్చు.

వసతి సౌకర్యాల విషయానికి వస్తే.. కొడైకెనాల్‌లోని బస్టాండ్ ప్రాంతం చుట్టుపక్కలా అనేక హోటళ్లు పర్యాటకులకు అందుబాటులో ధరల్లో లభిస్తాయి. స్టార్ హోటళ్లు, సాధారణ హోటళ్లతోపాటు రిసార్టులు, బంగళాలు, హాలీడే హోమ్స్, గెస్ట్‌హౌస్‌లు కూడా ఇక్కడ అనేకం ఉన్నాయి. అలాగే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన హోటల్, యూత్ హాస్టల్‌లు కూడా అందరికీ అందుబాటులో ఉంటాయి. అయితే వీటిలో ప్రవేశానికి ముందుగానే రిజర్వేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి