రాష్ట్రపతి కుమారునికి వ్యతిరేకంగా కాంగ్రెస్: భాజపా

సోమవారం, 5 అక్టోబరు 2009 (11:53 IST)
మహారాష్ట్ర ఎన్నికల్లో భాగంగా.. అమరావతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ కుమారుడికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పని చేస్తున్నాయని భారతీయ జనతా పార్టీ ఆరోపించింది. పాటిల్ కుమారుడిని ఎన్నికల్లో ఓడించేందుకు తిరుగుబాటు అభ్యర్థిగా బరిలోకి దిగిన సునీల్ దేశ్‌ముఖ్ వెనుక కేంద్ర భారీ పరిశ్రమల శాఖామంత్రి, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావు దేశ్‌ముఖ్ హస్తం ఉందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి గోపీనాథ్ ముండే ఆరోపించారు.

దీనిపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమ పార్టీకి చెందిన నేతల్లో కొన్ని అంతర్గత సమస్యలు ఉన్నమాట వాస్తవమేనన్నారు. అయినప్పటికీ.. కూటమి అభ్యర్థులకు మద్దతుగా పార్టీ శ్రేణులన్నీ పని చేస్తున్నాయని తెలిపారు. ప్రధానంగా... రాష్ట్రపతి కుమారుడు రావుసాహెబ్ షెకావత్‌కు అనుకూలంగా పని చేస్తున్నట్టు వచ్చిన వార్తల్లో ఏమాత్రం నిజం లేదన్నారు.

తమ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ జగదీష్ గుప్తాతో పాటు.. ఇతర నేతలు సైతం పార్టీ కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ శ్రేణులో రాష్ట్రపతి కుమారుడికి వ్యతిరేకంగా పని చేస్తున్నాయని ముండే ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి భాజపా-ఆర్.ఎస్.ఎస్‌కు అనుకూలంగా ఉందని ఆయన చెప్పారు.

వెబ్దునియా పై చదవండి