తమిళనాడులో భారీ వర్షాలు: 12 మంది మృతి

శుక్రవారం, 6 నవంబరు 2009 (19:10 IST)
FILE
తమిళనాడు రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇప్పటికే దాదాపు 12 మంది మృతి చెందారు. ఈ భారీ వర్షాలు మరో రెండు రోజులుంటాయని శుక్రవారం నాడు వాతావరణ శాఖ ప్రకటించింది.

తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో ముగ్గురు, కాంచీపురం, కడ్డలూరు, తిరువాయూర్, పెరంబూర్, మదురై, కన్యాకుమారి, తిరునల్వేలీ, తిరుచ్చిరాపల్లి, విరుదనగర్ ప్రాంతాల్లో చెరో ఒకరు మృతి చెందారని అధికారులు తెలిపారు.

భారీ వర్షాల కారణంగా చాలామంది తమ ఇండ్లలోని గోడలు కూలి, పైకప్పులు కూలిపోయి మృతి చెందారని, అలాగే చాలామంది ఇండ్లు కూలిపోయాయని పోలీసు వర్గాలు వెల్లడించాయి.

ఈశాన్య రుతుపవనాల కారణంగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయని, రానున్న మరో 48 గంటలపాటు తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగాధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా మత్స్యకారులు సముద్రంలో చేపలు పట్టేందుకు వెళ్ళరాదని అధికారులు సూచించారు.

ఇదిలావుండగా తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలోని పలు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో వాహనాలు ఎక్కడివక్కడ నిలిచిపోయి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోందని పోలీసులు పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి