దేశ రాజధానిలో ఇటీవల ప్రభుత్వ పాఠశాలలో జరిగిన తొక్కిసలాటకు ఆ పాఠశాల యంత్రాంగమే కారణమని తేలింది. ఈ తొక్కిసలాటపై జరిగిన న్యాయ విచరణలో దుర్ఘటనకు పాఠశాల యంత్రాంగమే కారణమని తేలినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఢిల్లీలోని ఖజూరి ఖాస్ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల సెప్టెంబరు 10న జరిగిన తొక్కిసలాటలో ఐదుగురు విద్యార్థినులు మృతి చెందిన సంగతి తెలిసిందే.
దుర్ఘటనకు పాఠశాల యంత్రాంగం సరిగా పని చేయకపోవడమే కారణమని, జరిగిన దుర్ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని న్యాయ విచారణ కమిటీ సిఫార్సు చేసింది. తొక్కిసలాటకు సంబంధించి ఈశాన్య ఢిల్లీ విద్యా శాఖ డిప్యూటీ డైరెక్టర్‌పై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికారిక వర్గాలు తెలిపాయి. విద్యార్థినులు క్లాసురూములు మారుతుండగా పాఠశాలలో తొక్కిసలాట జరిగింది.