ముంబై దాడుల్లో హైదరాబాద్ వాసి హస్తం!

మంగళవారం, 21 జులై 2009 (11:47 IST)
ప్రపంచాన్ని నివ్వెర పరిచిన ముంబై దాడుల్లో రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి హస్తం ఉన్నట్టు తీవ్రవాది అజ్మల్ కసబ్ చెప్పాడు. ఈ ప్రకటన దేశ నిఘా వర్గాలను నిపుణులను కలవరానికి గురి చేస్తోంది. ముఖ్యంగా, ముంబైపై దాడి చేసేందుకు ఎంపిక చేసిన తొమ్మిది మంది తీవ్రవాదులకు హైదరాబాద్‌‌కు చెందిన ఈ వ్యక్తే హిందీ నేర్పించాడని కసబ్ చెప్పుకొచ్చాడు. ఆ వ్యక్తి పేరు అబు జిందాల్‌ అని వివరించాడు.

హైదరాబాద్‌కు చెందిన జిందాల్.. ఐఎస్ఐ చర్యలకు ప్రేరేపితుడయ్యాడు. దీంతో అతన్ని ఐఎస్ఐ రిక్రూట్ చేసుకుని, ముజఫరాబాద్‌లో శిక్షణ ఇచ్చారని సమాచారం. ఇదిలావుండగా, గతంలో అహ్మదాబాద్, జైపూర్, న్యూఢిల్లీల్లో జరిగిన వరుస పేలుళ్ళలో జిందాల్ పేరు వినిపించింది. ఈ పేలుళ్లను విజయవంతంగా నిర్వహించడం వల్ల జిందాల్‌కు లష్కరే తోయిబా, ఐఎస్ఐ నేతలతో మరింత సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి.

అలాగే, ఇండియన్ ముజాహిదీన్ వ్యవస్థాపకుడు అమీర్ రాజాతో మరింత సాన్నిహిత్యం పెరిగింది. అంతేకాకుండా, లష్కర్ చీఫ్‌, 26/11 దాడుల సూత్రధారి జకీర్ ఉర్ రెహ్మాన్ లఖ్వీతో బలమైన సంబంధాలు ఉన్నాయి. హిందీలో అనర్గళంగా మాట్లాడే జిందాల్‌కు హైదరాబాద్‌తో సహా దేశంలోని ఇతర నగరాల్లో ఉండే వేర్పాటువాద నేతలతో సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి