స్వలింగ సంపర్కం: శిక్షార్హం కాదని సుప్రీంకు కేంద్రం విన్నపం

మంగళవారం, 28 ఫిబ్రవరి 2012 (15:27 IST)
FILE
స్వలింగ సంపర్కంపై కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకొంది. ఆ రకమయిన శృంగారం శిక్షార్హ పరిధిని తప్పించడం తప్పు కాదంటూ సుప్రీం కోర్టులో చెప్పింది. వాస్తవానికి, ఈ అంశంపై మొదటి నుంచి కేంద్ర ప్రభుత్వం సరయిన వైఖరి లేక ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటోంది.

సుప్రీం కోర్టు ధర్మాసనం సంధించే ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగే స్థితిలో కూడా లేని కేంద్ర ప్రభుత్వ న్యాయవాదులు ఈ అంశంపై ఒక్కోసారి ఒక్కోరకంగా మాట్లాడుతూ ధర్మాసనం ఆగ్రహానికి గురయ్యారు.

377 భారత శిక్షా స్మృతి ప్రకారం స్వలింగ సంపర్కాన్ని శిక్షించలేము అంటూ గతంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును పట్టించుకోనక్కరలేదన్న నిర్ణయం ప్రభుత్వానికి తలనొప్పి తెచ్చిపెట్టింది. స్వలింగ సంపర్కం అనేది అనైతికం, మన సంస్కృతికి వ్యతిరేకం అంటూ కేంద్ర ప్రభుత్వ న్యాయవాది ఈ నెల 23వ తేదీ నాటి వాదనల సమయంలో వాదించారు. దానికి కోర్టు విభేదించింది.

న్యాయ వ్యవస్థను కించపరిచే చర్యలను తాము సమర్ధించబోమంటూ ధర్మాసనం పేర్కొంది. సరయిన రీతిలో వాదనలకు సిద్దం కాకుండా విచారణకు హాజరవుతూ న్యాయస్థానం విలువయిన సమయాన్ని వృధా చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. మరింత సమాచారంతో తదుపరి వాదనలకు సిద్ధం కమ్మంటూ ఆ సమయంలో ఆదేశించిన సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి