ఆపరేషన్ సిందూర్‌తో భారీ నష్టం - 13 మంది సైనికులు మృతి

ఠాగూర్

ఆదివారం, 17 ఆగస్టు 2025 (15:39 IST)
గత ఏప్రిల్ నెలలో జరిగిన పహల్గాం ఉగ్రదాడులకు ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో భారీ నష్టం వాటిల్లినట్టు శత్రుదేశం పాకిస్థాన్ ఎట్టకేలకు అంగీకరించింది. భారత్ చేపట్టిన సైనిక చర్యల్లో తమ ఆర్మీకి చెందిన 13 మంది సైనికులతో పాటు మొత్తం 50 మంది ప్రాణాలు కోల్పోయారని వెల్లడించింది. తమ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మరణించిన సైనికులకు మరణానంతరం శౌర్య పతకాలను ప్రదానం చేసి, ఈ నిజాన్ని ప్రపంచం ముందు ఒప్పుకుంది.
 
జమ్మూకాశ్మీర్‌లోని పహల్గాం ఏప్రిల్ 22వ తేదీన జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మరణించిన సంగతి తెలిసిందే. లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్' (టీఆర్ఎఫ్) ఈ దాడికి బాధ్యత వహించింది. దీనికి ప్రతీకారంగా మే 7వ తేదీ తెల్లవారుజామున భారత వాయుసేన 'ఆపరేషన్ సిందూర్' పేరిట పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు జరిపింది. ఈ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టు భారత ప్రభుత్వం అప్పట్లో ప్రకటించింది.
 
అయితే, ఈ దాడులపై ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న పాకిస్థాన్, ఆగస్టు 14న తమ స్వాతంత్ర్యం దినోత్సవం సందర్భంగా అసలు నిజాన్ని బయటపెట్టింది. అధ్యక్ష భవనంలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేతుల మీదుగా 'ఆపరేషన్ సిందూర్' సమయంలో మరణించిన సైనిక సిబ్బందికి మరణానంతరం పురస్కారాలు అందజేశారు. ఈ దాడుల్లో భోలారీ ఎయిర్ బేస్‌పై జరిగిన దాడిలో మరణించిన స్క్వాడ్రన్ లీడర్ ఉస్మాన్ యూసఫు 'తమ్హా-ఇ-బసాలత్' పురస్కారాన్ని ప్రకటించారు. ఆయనతో పాటు హవల్దార్ ముహమ్మద్ నవీద్, నాయక్ వకార్ ఖాలిద్, లాన్స్ నాయక్ దిలావర్ ఖాన్‌లకు కూడా మరణానంతరం ఈ పురస్కారాన్ని ఇచ్చారు.
 
భారత దాడులు జరిగిన నూర్ ఖాన్, సర్దఘా, జాకోబాబాద్, భోలారీ, షోర్ కోట్ వైమానిక స్థావరాల్లో పలువురు గాయపడినట్లు కూడా సమాచారం. ముఖ్యంగా నూర్ ఖాన్ ఎయిర్ బేస్‌లో జరిగిన దాడిలో కొందరు అమెరికన్ టెక్నీషియన్లు సైతం గాయపడినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ అవార్డుల ప్రదానంతో భారత వైమానిక దాడుల తీవ్రతను, దానివల్ల తమకు జరిగిన నష్టాన్ని పాకిస్థాన్ పరోక్షంగా అంగీకరించినట్టు అయింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు