మనీ లాండరింగ్ కేసు : బాలీవుడ్ నటి జాక్వెలిన్‌కు ఎదురుదెబ్బ

ఠాగూర్

సోమవారం, 22 సెప్టెంబరు 2025 (14:54 IST)
మనీ లాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తనపై ఉన్న రూ.215 కోట్ల ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసును కొట్టివేయాలంటూ సుప్రీంకోర్టులో ఆమె పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం సోమవారం ఆ పిటిషన్‌ను తిరస్కరించింది. 
 
ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్‌ ప్రధాన నిందితుడిగా ఉన్న రూ.200 కోట్ల దోపిడీ కేసులో జాక్వెలిన్‌ను ఈడీ నిందితురాలిగా పరిగణించిన సంగతి తెలిసిందే. దోపిడీ చేసిన డబ్బు నుంచి నటి లబ్ధి పొందినట్లు దర్యాప్తులో గుర్తించామని ఈడీ వర్గాలు వెల్లడించాయి. సుకేశ్ చంద్రశేఖర్‌ దోపిడీదారు అని జాక్వెలిన్‌కు ముందే తెలుసని, అయినప్పటికీ అతడితో సాన్నిహిత్యాన్ని కొనసాగించారని సదరు వర్గాలు పేర్కొన్నాయి. 
 
దాదాపు రూ.200కోట్ల మనీలాండరింగ్‌ కేసులో ప్రధాన నిందితుడైన సుకేశ్ నుంచి జాక్వెలిన్‌ ఖరీదైన బహుమతులు అందుకున్నట్లు వార్తలు వచ్చాయి. అత్యంత ఖరీదైన డిజైనర్‌ బ్యాగులు, జిమ్‌ సూట్లు, వజ్రాల చెవిపోగులు, బ్రాస్‌లెట్‌, మినీ కూపర్‌.. ఇలా దాదాపు రూ.10 కోట్ల విలువైన కానుకలను జాక్వెలిన్‌, ఆమె కుటుంబసభ్యులకు సుకేశ్ ఇచ్చినట్లు ఈడీ దర్యాప్తులో గుర్తించింది. దీంతో ఆమెపై ఈడీ కేసు నమోదు చేయగా, ఈ కేసు విచారణ ప్రస్తుత సాగుతోంది. ఈ కేసును కొట్టివేయాలని ఆమె సుప్రీంను ఆశ్రయించగా కోర్టు పిటిషన్‌ను తిరస్కరించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు