ఇండోర్‌లో స్వైన్ ఫ్లూ విజృంభించింది. జనవరి నుంచి ఇప్పటివరకు ఈ వ్యాధితో 41మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 644 మందిని పరీక్షించగా అందులో 152 మందికి స్వైన్ ఫ్లూ సోకిందని తేలింది.
ప్రస్తుతం మరో 19 మంది స్వైన్ ఫ్లూతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ముఖ్య వైద్యాధికారి ప్రవీణ్ జాదియా చెప్పారు. స్వైన్ ఫ్లూ కలకలంతో తాము ఫీవర్ క్లినిక్ తెరచామని ప్రవీణ్ తెలిపారు.
స్వైన్ ఫ్లూతో ఇండోర్ నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు సూచించారు. ఇండోర్ సిటీలో మాత్రం 20 మంది ప్రాణాలు కోల్పోయారని జాదియా వెల్లడించారు. స్వైన్ ఫ్లూ అంటు వ్యాధి కావడం ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు.
ముఖ్యంగా వేగంగా శ్వాస తీసుకోవటం, నీరు తాగటంలో లేదా ఆహారం మింగటంలో ఇబ్బంది ఏర్పడటం, జ్వరం, తీవ్రంగా దగ్గు లాంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలని వైద్యులు హెచ్చరించారు.