ఢిల్లీకి వచ్చిన అప్ఘాన్ శరణార్థులకు కరోనా.. 16 మందికి పాజిటివ్

బుధవారం, 25 ఆగస్టు 2021 (10:32 IST)
తాలిబాన్లు కాబూల్‌ను హస్తగతం చేసుకున్న తర్వాత అప్ఘానిస్తాన్‌లో అల్లకల్లోలం నెలకొంది. ప్రాణాలరచేత పట్టుకొని అక్కడి ప్రజలు విదేశాలకు వలస పోతున్నారు. భారత్‌ కూడా వారికి ప్రత్యేక ఎమర్జెన్సీ వీసాలను జారీచేసి.. విమానాల్లో తరలిస్తోంది. 
 
మంగళవారం మరో ఎయిర్ ఇండియా విమానం ఢిల్లీకి చేరింది. అందులో 44 మంది అప్ఘనిస్తాన్ సిక్కుల సహా మొత్తం 78 మంది భారత్‌కు వచ్చారు. కాబూల్‌ నుంచి తజకిస్థాన్‌లోని దషాంబే మీదుగా ఢిల్లీకి వారిని తరలించారు. 
 
అప్ఘానిస్తాన్ సిక్కులకు కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి స్వయంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి తీసుకొచ్చిన మూడు సిక్కుల పవిత్ర గ్రంథాలను కేంద్రమంత్రి హర్దీప్ సింగ్‌కు వారు అందజేశారు. 
 
కాబూల్ నుంచి వచ్చిన వారికి ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా కరోనా పరీక్షలు నిర్వహించగా 16 మందికి పాజిటివ్ వచ్చింది. వారిని ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు. ఐతే అప్ఘనిస్తాన్ నుంచి వస్తున్న వారికి కేంద్రం 14 రోజుల క్వారంటైన్ తప్పని సరిచేసిన విషయం తెలిసిందే. 
 
ఆఫ్ఘానిస్థాన్‌ నుంచి ఇప్పటివరకు 626 మంది భారత్‌కు వచ్చారని కేంద్ర మంత్రి హరిదీప్‌సింగ్‌ పూరి తెలిపారు. వీరిలో 228 మంది భారతీయులు, 77 మంది ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన సిక్కులు ఉన్నారని వెల్లడించారు. 
 
ఈ 626 మందిలో భారత దౌత్య సిబ్బంది లేరని కేంద్రం తెలిపింది. ఆ ఉద్యోగులతో కలుపుకుంటే కాబూల్ నుంచి ఇండియాకు వచ్చిన వారి సంఖ్య మరింత పెరుగుతుంది. తరలింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు