కేరళ రాష్ట్రంలో సభ్య సమాజం తలదించుకునే సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. 16 యేళ్ల మైనర్ బాలుడిపై గత రెండేళ్లుగా లైంగిక దాడి జరుగుతోంది. ఈ దారుణానికి పాల్పడిన నిందితుల్లో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉండటం గమనార్హం. గే డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన బాలుడిపై ఈ దారుణం జరిగింది. తన కుమారుడి ప్రవర్తనలో తల్లి మార్పులు గమనించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
ఈ వివరాలను పరిశీలిస్తే, కేరళ రాష్ట్రంలోని కాసర్‍గోడ్ జిల్లాకు చెందిన ఓ డేటింగ్ యాప్ ద్వారా నిందితులు పరిచయమయ్యారు. స్నేహం పేరుతో దగ్గరై గత రెండేళ్లుగా అతడిపై లైంగిక దాడికి పాల్పడుతున్నారు. ఈ అఘాయిత్యం కేవలం బాలుడు ఇంట్లోనేకాకుండా, కన్నూరు, కోళికోడ్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కూడా జరిగినట్టు విచారణలో తేలింది. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుల వయసు 25 నుంచి 51 యేళ్ల మధ్య ఉంటుందని. వీరిలో ఒకరు రైల్వేశాఖలో పని చేస్తున్న ఉద్యోగి కూడా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.
ఇటీవల ఓ రోజున బాలుడి తల్లి ఇంట్లో ఓ అపరిచిత వ్యక్తిని గమనించారు. ఆమెను చూడగానే ఆ వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో అనుమానం వచ్చిన ఆమె తన కుమారుడుని నిలదీయగా రెండేళ్ళుగా తనపై జరుగుతున్న లైంగికదాడి గురించి చెప్పడంతో ఆ తల్లి హతాశురాలైంది. వెంటనే ఆమె చైల్డ్ హెల్ప్ లైన్‌ను ఆశ్రయించడంతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఇప్పటివరకు 9 మందిని అరెస్టు చేశారు.
బాధితుడు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టి పోక్సో చట్టం కింద మొత్తం 14 కేసులు నమోదు చేశారు. కాసర్‌గోడ్‌లో నమోదైన 8 కేసుల దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేశారు. మిగిలిన ఆరు కేసులను కన్నూర్, కోళికోడ్ జిల్లాల పోలీసులకు బదిలీ చేసారు. పరారీలో ఉన్న మరో ఐదుగురు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనపై కేరళ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మైనర్లపై నేరాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.