ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మరోమారు కొండ చరియలు విరిగిపడ్డాయి. భారీగా కొండచరియలు విరిగిపడటంతో 300 మంది మంది ప్రయాణికులు ఘాట్ రోడ్లపై చిక్కుకుపోయారు. వాటి వల్ల రాష్ట్రంలోని పితోరాగఢ్ జిల్లాలోని లఖన్‌పుర్ సమీపంలోని లిపులేఖ-తవఘాట్ రహదారి 100 మీటర్ల మేర కొట్టుకుపోయింది. దీంతో ప్రయాణికుల రాకపోకల కోసం రెండు రోజుల తర్వాత ఈ రోడ్డును తెరిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ఉత్తరాఖండ్‌లోని చార్‌ధామ్ యాత్రకు ఈసారి భారీసంఖ్యలో భక్తులు పోటెత్తారు. మంచుకొండల్లో ప్రయాణానికి అక్కడక్కడా వీరికి కొంత అసౌకర్యం కలుగుతున్నప్పటికీ వారు లెక్క చేయడం లేదు. నవంబరు రెండో వారం వరకూ ఈ యాత్ర కొనసాగనుంది. ఈ సమయంలో కొండచరియలు విరిగిపడటం ఆందోళనకరంగా మారింది. ఈ క్రమంలో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
అల్మోరా, చమోలీ, చంపావత్, దేహ్రాదూన్, హరిద్వార్, గర్వాల్, నైనిటాల్, రుద్రప్రయాగ, తెహ్రీ గర్వాల్, పితోరాగఢ్, ఉద్దమ్ సింగ్ నగర్, ఉత్తరకాశీ జల్లాల్లో తుపాన్, ఉరుములతో కూడిన వర్ష సూచనలు ఉన్నాయని తెలిపింది. అలాగే యాత్రికులంతా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని పోలీసులు అడ్వైజరీ జారీ చేశారు.