ఏటీఎంలోంచి కరెన్సీ నోట్లకు బదులు పాము పిల్లలు బయటకు రావడం ఉత్తరాఖండ్‌లో కలకలం రేపింది. నైనితాల్ జిల్లాలోని రామ్‌నగర్ కోసీ రోడ్డులో వున్న ఏటీఎంలో ఇది జరిగింది. కోసీ రోడ్డులోని ఎస్బీఐకి చెందిన ఏటీఎంకు డబ్బులు విత్ డ్రా చేసేందుకు ఓ వ్యక్తి వెళ్లాడు.
డబ్బుల కోసం చేయాల్సిన ప్రాసెస్ చేశాడు. కానీ డబ్బులకు బదులు ఓ పాముపిల్ల బయటికి వచ్చింది. దీంతో ఆ వ్యక్తి షాకయ్యాడు. సదరు వ్యక్తి మెషీన్‌లో ఏటీఎం కార్డు పెట్టగానే.. అతడికి పాముపిల్ల కనిపించింది. వెంటనే ఏటీఎం సెక్యూరిటీ గార్డుకు విషయాన్ని తెలిపాడు.
సెక్యూరిటీ సమాచారం మేరకు బ్యాంకు అధికారులు, సేవ్ ది స్నేక్ అండ్ వెల్ఫేర్ సొసైటీ అక్కడికి చేరుకుని ఏటీఎంను తెరిచారు. అందులో 10 పాము పిల్లలు ఉన్నట్లు గుర్తించారు.
అవి విషపూరితమైన పాములని చెప్పారు. దీంతో వాటిని అడవిలో విడిచిపెట్టారు. దీంతో ఆ ఏటీఎంను తాత్కాలింగా మూతపడింది.