దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ ఎక్కువైపోతోంది. ఈ వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య లక్ష దాటిపోయింది. అదేసమయంలో దేశ వ్యాప్తంగా కరోనా టీకాల వంపిణీ కూడా జోరుగా సాగుతోంది. అయితే పలు ప్రాంతాల్లో ఈ వ్యాక్సిన్లు సరిపడ సంఖ్యలో అందుబాటులో లేవు. ఈ పరిస్థితి సాక్షాత్ దేశ ప్రధాని నరేంద్ర మోడీ సొంత నియోజకవర్గమైన వారణాసిలోనే నెలకొంది.
ప్రధాని నరేంద్ర మోడీ ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గమైన వారణాసిలోనే ఈ వ్యాక్సిన్ కొరత ఏర్పడింది. ఫలితంగా 66 ఆస్పత్రులకు గాను 41 ఆస్పత్రులను మూసివేశారు. ప్రస్తుతం 25 ఆస్పత్రుల్లో మాత్రమే టీకా ప్రక్రియ కొనసాగుతోంది. వారణాసి జిల్లాకు సరఫరా చేసే సెంటర్‌ను కూడా మూసివేశారు. టీకాల కొరతపై ప్రజలకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదని ఆరోగ్య శాఖ అధికారులు అంటున్నారు.
దీనిపై హెల్త్ వర్కర్లు స్పందిస్తూ, లక్నో నుంచి సరఫరా అవుతున్న టీకా క్రమంగా జిల్లాలకు తగ్గించేశారు. కానీ వారణాసిలో కొవిడ్ టీకాకు చాలా డిమాండ్ ఉందన్నారు. ఇప్పుడు టీకా అందుబాటులో లేకపోవడం ఆందోళన కలిగించే విషయమన్నారు. టీకా కొరతపై ఇప్పటికే నోడల్ అధికారికి సమాచారం అందించినప్పటికీ ఫలితం లేదన్నారు.