చావు బతుకుల రేసులో అమెరికా... జో బైడెన్ ఆవేదన

బుధవారం, 7 ఏప్రియల్ 2021 (15:00 IST)
ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్.. అగ్రరాజ్యం అమెరికాను సైతం వదిలిపెట్టలేదు. ఈ వైరస్ దెబ్బకు అగ్రరాజ్యం చిగురుటాకులా వణికిపోయింది. కోట్ల మంది ఈ వైరస్ బారినపడ్డారు. మృతుల సంఖ్య లక్షల్లోనే వుంది. ప్రస్తుతం కాస్తంత శాంతించినప్పటికీ.. పరిస్థితులు మాత్రం ఇప్పుడిపుడే చక్కబడుతున్నాయి. ఇంతలోనే వైరస్ రెండో దశ వ్యాప్తి మొదలైంది. దీనిపై ఆ దేశ అధ్యక్షుడు జో బైడన్ స్పందించారు. ‌కరోనా వైరస్‌ విషయంలో అమెరికా ఇప్పటికీ చావు బతుకుల రేసులోనే ఉందన్నారు. 

అందువల్ల ప్రజలు తప్పనిసరిగా కరోనా వ్యాప్తిని నివారించేలా జాగ్రత్తలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేవలం 75 రోజుల్లో 150 మిలియన్ల డోసుల వ్యాక్సినేషన్‌ పూర్తిచేసిందన్నారు. ఈ మేరకు వర్జీనియాలోని ఓ వ్యాక్సినేషన్‌ కేంద్రం సందర్శన సందర్భంగా బైడెన్‌ వెల్లడించారు. 

తొలుత బైడెన్‌ ప్రభుత్వం వందరోజుల్లో వంద మిలియన్‌ డోసులు ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ.. ఇప్పుడు ఆ లక్ష్యాన్ని 200 మిలియన్లకు పెంచుతూ నిర్దేశించినట్టు తెలిపారు. 

అయితే, 'కరోనా వైరస్‌ విషయంలో అమెరికా ఇంకా చావు బతుకుల రేసులోనే ఉంది. అనుకున్న లక్ష్యం కోసం మనం ఎంతో శ్రమించాల్సి ఉంది. ప్రతిఒక్కరికీ వ్యాక్సిన్‌ పూర్తయ్యే వరకు అందరూ సామాజిక దూరం పాటించడం, చేతులు పరిశుభ్రంగా కడుక్కోవడం, మాస్కులు ధరించడం వంటి జాగ్రత్తలు విధిగా నిర్వర్తించాలి. 

జులై 4వ తేదీలోపు మంచి రోజులు వస్తాయి. ఆలోపు ఎంతమందిని కాపాడుకుంటామనేది ముఖ్యం. కాబట్టి ప్రతిఒక్కరూ తమ వంతు వచ్చినపుడు టీకాలు వేయించుకోండి. మాస్కులు ధరించండి, సామాజిక దూరం పాటించండి’ అని బైడెన్‌ విజ్ఞప్తి చేశారు. 

ఏప్రిల్‌ 19 నుంచి దేశవ్యాప్తంగా వయోజనులందరికీ వ్యాక్సిన్‌ తీసుకోవడానికి అర్హత కల్పిస్తామన్నారు. ఇంకా కొత్త కేసులు పెరగడం, ఆస్పత్రుల్లో చేరుతున్న బాధితుల సంఖ్య పెరగడంపై బైడెన్‌ విచారం వ్యక్తం చేశారు. కాగా, ప్రపంచంలోనే అత్యధికంగా అమెరికాలో ఇప్పటివరకు 5,54,064 మంది కరోనాతో మరణించిన విషయం తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు