జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని సెంట్రల్ కాశ్మీర్లో ఘోరం జరిగింది. ఓ కారు లోయలో పడిన ఘటనలో మొత్తం 9 మంది మృత్యువాతపడ్డారు. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. కాశ్మీర్‌లోని కార్గిల్ నగరం నుండి శ్రీనగర్ వైపు వెళుతున్న కారు ఒకటి గంధర్‌పాల్ జిల్లా శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారికి వెళుతుండగా ఆ కారు నియంత్రణ కోల్పోయి సమీపంలో ఉన్న భారీ లోయలోకి దూసుకెళ్లింది.
దీంతో అందులో ప్రయాణిసున్న వారిలో 9 మంది చనిపోయారు. ఘటనా స్థలంలో నలుగురు చనిపోగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఐదుగురు ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
దీనిపై పోలీసులు స్పందిస్తూ, ప్రయాణికులతో కూడిన కారు కార్గిల్ నుంచి సోనామార్గ్‌కు వెళ్తుండగా రాత్రి రోడ్డుపై నుంచి జారిపడి 400 అడుగుల మేర బోల్తా పడిందని అధికారులు తెలిపారు. ప్రమాద స్థలం నుంచి మృతుల మృతదేహాలను వెలికితీసి గుర్తించారు. మృతి చెందిన వారిలో గుజరాత్, జార్ఖండ్, పంజాబ్, ఛత్తీస్‌గఢ్‌లకు చెందిన సందర్శకులు ఉన్నట్టు తెలిపారు.