శారీరకంగా కాదు.. మానసికంగా వేధించారు.. అభినందన్ వర్ధమాన్

ఆదివారం, 3 మార్చి 2019 (10:25 IST)
శత్రు సైన్యం చేతిలో బందీగా ఉన్న సమయంలో తాను తీవ్ర మానసిక వేధింపులు ఎదుర్కొన్నట్టు భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ తెలిపారు. ప్రస్తుతం ఆయనకు ఢిల్లీలోని ఎయిర్‌ఫోర్స్ సెంట్రల్ మెడికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ఏఎఫ్‌సీఎంఈ)లో వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
 
పాకిస్థాన్ యుద్ధ విమానాలను తరిమికొట్టే క్రమంలో శత్రుదేశ యుద్ధ విమానాన్ని కూల్చివేసిన అభినందన్.. తాను ప్రయాణిస్తున్న మిగ్21 విమానం కూలిపోవడంతో పాక్ గడ్డపై అడుగుపెట్టాడు. దీంతో అతను పాక్ ఆర్మీ వద్ద 48 గంటల పాటు బందీగా ఉన్నాడు. 
 
ఆ తర్వాత అంతర్జాతీయ సమాజంతో పాటు.. ప్రపంచ దేశాల ఒత్తిడి, భారత దౌత్యనీతికి తలొగ్గిన పాకిస్థాన్ అభినందన్‌ను సురక్షితంగా భారత్‌కు అప్పగించింది. అభినందన్ భారత్‌కు చేరుకోగానే ఆస్పత్రికి తరలించి వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. 
 
తాను పాకిస్థాన్‌ వద్ద బందీగా ఉన్న సమయంలో తీవ్ర మానసిక వేధింపులను ఎదుర్కొన్నట్టు వెల్లడించారు. ఆస్పత్రిలో ఉన్న అభినందన్‌ను రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ కలుసుకున్నారు. ఈ సందర్భంగా వర్ధమాన్ వారితో మాట్లాడుతూ, దాదాపు 60 గంటలపాటు పాకిస్థాన్‌లో బందీగా ఉన్న తనను ఆ దేశ అధికారులు తీవ్ర మానసిక వేదనకు గురిచేశారని చెప్పారు. 
 
అయితే శారీరకంగా మాత్రం తనను హింసించలేదని తెలిపారు. భారత రక్షణ రహస్యాలను రాబట్టేందుకు పాక్ అధికారులు ఆయనను పలువిధాలుగా ప్రశ్నించారని, ఈ క్రమంలో ఆయనను మానసికంగా వేధించారని అధికార వర్గాలను ఉటంకిస్తూ ఏఎన్‌ఐ వార్తాసంస్థ పేర్కొంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు