ప్రజా తీర్పును స్వీకరిస్తున్నా: రాహుల్‌ ... అసోం ఓటర్లకు మోడీ కృతజ్ఞతలు

గురువారం, 19 మే 2016 (14:29 IST)
దేశంలో గురువారం వెల్లడైన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ స్పందించారు. ప్రజల తీర్పును తాము శిరసావహిస్తూ స్వీకరిస్తున్నట్టు తన సోషల్ మీడియా ఖాతా ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. ఎన్నికల్లో విజయం దిశగా ముందుకు దూసుకుపోతున్న పార్టీలకు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.
 
ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అసోంలో అధికారాన్ని కోల్పోయింది. అలాగే, కేరళ, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు విజయంవైపు దూసుకెళ్తున్నాయి. కానీ, పుదుచ్చేరిలో మాత్రం గుడ్డిలో మెల్ల అన్న చందంగా కొన్ని సీట్లను కైవసం చేసుకుని ఊపిరి పీల్చుకుంది. 
 
ఇకపోతే అసోం ఓటర్లకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ రాష్ట్రంలో భాజపా భారీ మెజార్టీతో విజయం దిశగా దూసుకుపోతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేస్తూ ఆ రాష్ట్ర భాజపా ముఖ్యమంత్రి అభ్యర్థి శర్వానంద సోనోవాల్‌కు ఫోన్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. 
 
రాష్ట్రంలో చరిత్రాత్మక విజయం సాధించినందుకు కార్యకర్తలకు, అసోం ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ విజయం సాధించడానికి, ప్రచారం కోసం పార్టీ నేతలు తీవ్రంగా శ్రమించారని వారందరికీ ధన్యవాదాలు అంటూ మోదీ ట్వీట్‌ చేశారు. అసోంలో 15 ఏళ్ల కాంగ్రెస్‌ పాలన తర్వాత భాజపా సారథ్యంలోని ఎన్డీయే కూటమి తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. 

వెబ్దునియా పై చదవండి