తమిళ నిర్మాతల మండలి ఎన్నికల్లో గెలిచి నటుడు విశాల్ సంచలనం సృష్టించారు. ఈ నేపథ్యంలో చెన్నై ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో విశాల్ పోటీ చేస్తారని జరిగిన ప్రచారానికి శనివారం తెరపడింది. చెన్నై ఆర్కే నగర్ ఎన్నికల్లో పోటీ చేస్తానని విశాల్ ప్రకటించారు. స్వతంత్ర అభ్యర్థిగా ఈ ఎన్నికల్లో విశాల్ పోటీ చేస్తారు. నిర్మాతల మండలి ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్న విశాల్, ప్రత్యక్ష రాజకీయాల్లో తన క్రేజ్ ఏ విధంగా వుందనే పరీక్షించుకునేందుకు విశాల్ ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
దివంగత ముఖ్యమంత్రి జయలలిత నియోజకవర్గమైన ఆర్కే నగర్‌లో విశాల్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగడంతో అన్నాడీఎంకే, డీఎంకే షాక్ తిన్నాయి. ఇక రాజకీయాల్లో రానున్నట్లు ఇప్పటికే ప్రచారం చేసిన సినీ లెజెండ్ కమల్ హాసన్ మద్దతు ప్రకటించే అవకాశం ఉందని, విశాల్‌కు మద్దతుగా కమల్ ప్రచారం చేసే అవకాశం ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు మినహా ప్రజలు మార్పు కోసం విశాల్‌కు ఓటేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.