తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణంతో ఈనెల 21వ తేదీన ఆమె ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చిన ఆర్కే.నగర్ ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకేలతో పాటు చిన్నాచితక పార్టీలు, అన్నాడీఎంకే రెబెల్స్ నేత టీటీవీ దినకరన్ కూడా పోటీ చేయనున్నారు.
ఈనేపథ్యంలో కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ కూడా పోటీ చేసేందుకు సిద్ధమైనట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నారనే వార్త హల్‌చల్ చేస్తోంది. అయితే, నామినేషన్ల దాఖలుపర్వం శుక్రవారంతో ముగియనుంది. అందువల్ల ఆయన నామినేషన్ దాఖలు చేస్తే మాత్రం పోటీ చేస్తున్నట్టే.
కాగా, సామాజిక అంశాల పట్ల తక్షణం స్పందించే నటులలో ఒకడు విశాల్. తమిళనాట జల్లికట్టు నుంచి మొదలు పెడితే మెర్సెల్ వరకు ఎన్నో అంశాల్లో విశాల్ తనదైన శైలిలో స్పందించాడు. ఈ తెలుగు కుర్రోడు ఒక హీరోగానేకాకుండా, నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శిగా, తమిళ సినీ నిర్మాతల సంఘం అధ్యక్షుడిగా కూడా సినీ రంగం అభివృద్ధికి కృషి చేస్తున్న విషయం తెల్సిందే.